ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

by Sumithra |   ( Updated:2020-11-10 07:29:57.0  )
ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, పటాన్ చెరు: పొట్టకూటి కోసం ఊరు గాని ఊరులో పని చేస్తూ స్వగ్రామానికి కారులో బయలుదేరుతున్న తరుణంలో నిద్రలో ఉండగానే ఆరుగురు జీవితాలు చీకట్లో కలిసిపోయాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల పరిధిలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై పాటి గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న డీఎల్ 5‌సీఈ 5176 కారును మరో వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. ఘటన స్థలాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పటాన్ చెరు ఇంఛార్జీ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదంపై ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…. జైలో కార్లో మొత్తం 9 మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.

తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఆరుగురు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను వెంటనే పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించామని చెప్పారు. వీరంతా బెంగళూరు, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించామన్నారు. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందన్నారు. జైలో వాహనాన్ని ఎవరు డ్రైవ్ చేశారనేది తెలియాల్సి ఉందని చెప్పారు. జైలో వాహనాన్ని ఢీ కొట్టిన మరో వెహికిల్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీరంతా ఓ ప్రైవేట్ కంపెనీలో కార్పెంటర్లుగా పనిచేస్తున్నారని వీరితో పాటు ఉన్న వ్యక్తి తెలిపాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు… కమలేష్ లోహరే, హరి లోహరే, ప్రమోద్ భుహెర్, వినోద్ భుహెర్ లు రాంఘడ్ ప్రాంతానికి చెందిన వారు. పవన్ కుమార్- గోరకపూర్ (బాంగ్లాదేశ్ చందిన వాడు), కాగా గాయపడిన వారిలో ప్రమోద్ కుమార్, అర్జున్, ఆనంద్ కుమార్, చంద్ర వంశీ లు గోరకపూర్ నివాసులు.

రోడ్డు ప్రమాదం పై ఎమ్మెల్యే జీఎంఆర్ దిగ్భ్రాంతి
పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం తెల్లవారుజామున ఆయన పరామర్శించి మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లక్షా 50 వేల రూపాయలు సొంత నిధులతో అంబులెన్స్ లు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు మృతదేహాలను తరలించారు.

Advertisement

Next Story

Most Viewed