దేశంలో ఒక్కరోజే 5,611 పాజిటివ్ కేసులు

by vinod kumar |
దేశంలో ఒక్కరోజే 5,611 పాజిటివ్ కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు తీవ్రమవుతోంది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 5,611 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,67,050కి చేరింది. ఒక్కరోజే 140 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 3,303 కు చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 42,298మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 61,149 ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. దేశంలోనే అత్యధిక కేసులున్న మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 2,078 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 37,136కి చేరింది. ఇక్కడ ఒక్కరోజే 65 మంది కరోనాతో మరణించడంతో మృతుల సంఖ్య 1,390 కు చేరింది. రాజధాని ముంబైలో 1,372 కొత్త కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య23,935కు చేరింది. ఇక్కడ ఒక్కరోజే 41మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 841గా నమోదైంది. ముంబైలోని ధారావి మురికివాడలో కొత్తగా 25 కేసులు నమోదవగా ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 1378కి చేరింది.

తమిళనాడులోనూ కరోనా వేగంగా వ్యాపిస్తూనే ఉంది. రాష్ట్రంలో ఒక్కరోజే 743 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 13,191కి చేరింది. తాజాగా ముగ్గురు మరణించడంతో.. చనిపోయిన వారి సంఖ్య 87కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,059యాక్టివ్ కేసులున్నాయి. గుజరాత్‌లో ఒక్కరోజే 398 కొత్త కేసులు నమోదవ్వగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య12,539కు చేరింది. ఇప్పటి వరకు ఇక్కడ వ్యాధి సోకి మొత్తం 749 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 10,554కు చేరుకుంది. ఢిల్లీలో ఇప్పటివరకు కరోనాతో 168 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 68 పాజిటివ్‌లు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,407కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 715 యాక్టివ్ కేసులుండగా 1,639 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed