తెలంగాణ ఖజానా ఖాళీ.. ఆదాయమార్గమేది?

by Anukaran |
cm kcr
X

ఖజానాలో కాసుల్లేవ్.. ఆదాయమార్గాలన్నీ మూసుకుపోయాయి. కరోనా 50 వేల కోట్ల నష్టం చేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇప్పుడున్న బడ్జెట్ లో దాదాపు 89 % మేర ఖర్చు సంక్షేమ పథకాలు, ఉద్యోగుల వేతనాలు, పాత అప్పులు, వాటిపై వడ్డీ చెల్లింపునకు వినియోగిస్తున్నారు. వీటికి తోడు మిషన్ భగీరథ లాంటి పథకాల కోసం తీసుకున్న అప్పులో అసలు పాటు వడ్డీని కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. కుప్పలుగా పేరుకుతుపోతున్న అప్పలు తీర్చడంతోపాటు సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల హామీలను నెరవేర్చడం అంతా ఆశామాషీ వ్యవహారం కాదు. ఈ గండం నుంచి గట్టేక్కేందుకు ప్రభుత్వం భూములు విక్రయిస్తుందా..? లేక పన్నులు పెంచుతుందా? ఇంతకు ఆదాయ పెంపు మార్గం ఏంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని, గత బడ్జెట్ కన్నా ఎక్కువ కేటాయింపులే ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా రూ. 50 వేల కోట్ల నష్టం వాటిల్లినా గతం కన్నా ఎక్కువ బడ్జెట్ ఎలా సాధ్యమవుతుందనే అనుమానం నెలకొంది. లాక్‌డౌన్, కరోనా పరిస్థితులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై లక్ష కోట్ల రూపాయల మేర ఆర్థిక ప్రభావం చూపిందని స్వయంగా ముఖ్యమంత్రే వ్యాఖ్యానించడంతో కొత్త బడ్జెట్‌లో ఆర్థిక వనరుల సమీకరణ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్ రూపకల్పన రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు సవాల్‌గా మారింది. అప్పులు చేయడమా.. పన్నులు పెంచడమా.. ప్రభుత్వ భూములను అమ్మడమా.. ఏ రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

గతేడాది బడ్జెట్‌ అంచనాల్లో దాదాపు మూడోవంతు ఆదాయం సమకూరనే లేదు. అయినా ఈ బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త పన్నులు విధించే ధైర్యం చేస్తుందా? ప్రజలపై ఆ భారం పడితే రాజకీయంగా ఎలాంటి చేటు తెస్తుంది? ఇలాంటి సందేహాల నడుమ ప్రభుత్వం ఎలాంటి ఆదాయ మార్గాలను అన్వేషిస్తుందనేది కీలకంగా మారింది. ప్రభుత్వం గత బడ్జెట్‌లోనే రాజీవ్ స్వగృహ, గృహకల్పలాంటి భూముల్ని అమ్మే ప్రతిపాదనలు చేసింది. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు. ఈసారి కూడా అలాంటి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతాయా? అనేది ఆర్థిక శాఖ అధికారులకు అనుమానంగానే ఉంది. కరోనా తర్వాతి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏర్పడిన స్తబ్ధత, క్రయవిక్రయాలు పడిపోవడంలాంటి కారణాలతో భూముల విక్రయం ద్వారా ఏ మేరకు ఆదాయం వస్తుందనేదానిపై అధికారులకు కూడా స్పష్టత లేదు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ధరల పెంపు ఆలోచన ఉన్నా ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతున్నది.

కరోనా కారణంగా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం అప్పులపైనే ఎక్కువగా ఆధారపడింది. మునుపెన్నడూ లేనన్ని అప్పులు చేసింది. అన్‌లాక్ తర్వాత ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడినా కరోనా సమయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేంత స్థాయిలో లేదు. ఇన్ని చిక్కుల నడుమ బడ్జెట్‌లో కేటాయింపుల పెంపు, స్వీయ ఆర్థిక వనరులపై ఆధారపడటం, సంక్షేమ రంగానికి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేయాల్సిన అనివార్య పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం సమకూర్చుకోవడం సర్కార్‌కు సంకటంగా మారింది. దీనికి తోడు నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, తదితర అంశాలు అమలుకు నోచుకోలేకపోయినా.. ఎన్నికల హామీలను ఈ ఏడాది నుంచి అమలు చేయాల్సి రావడం కూడా ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయం అంతంతమాత్రంగా ఉండటం, మరోవైపు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో గ్రాంట్లు రాకపోవడం, ఇంకోవైపు జీఎస్టీ పరిహారం సకాలంలో విడుదల కాకపోవడం, అన్నింటికీ మించి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గిపోవడంలాంటి కారణాలతో సొంత ఆదాయంపైనే ప్రభుత్వం ఆధారపడాల్సి వస్తోంది.

89% ఖర్చు వడ్డీలు, పథకాలు, వేతనాలకే

ఇప్పుడున్న బడ్జెట్‌లో దాదాపు 89% మేర ఖర్చు సంక్షేమ పథకాలు, ఉద్యోగుల వేతనాలు, పాత అప్పులను తీర్చడం, వాటిపైన వడ్డీ చెల్లింపు లాంటి అవసరాలకే సరిపోతున్నందున ఎన్నికల మేనిఫెస్టోలోని పెండింగ్ పథకాలను అమలు చేయడం రాష్ట్ర సర్కార్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. గడిచిన ఆరేళ్ళలో చేసిన అప్పుల్లో మిషన్ భగీరథలాంటి పథకాల కోసం తీసుకున్న రుణాల్లో అసలు మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కట్టాలి. దానిపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంది.

వచ్చే యేడాది వడ్డీలే రూ. 16 వేల కోట్లు

రానున్న ఆర్థిక సంవత్సరంలో కేవలం వడ్డీల కోసమే రూ. 16 వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇది ఏడాది మొత్తం ప్రభుత్వం ఇస్తున్న ‘రైతుబంధు’ నిధులకు సమానం. కరోనా సమయంలో ప్రభుత్వానికి అన్ని రకాల ఆదాయాలు పడిపోయినా మద్యం ద్వారా సమకూరేది మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తున్నది. దీన్ని మరింతగా పెంచుకోడానికి ఇప్పటికే అదనపు బార్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం రానున్న కాలంలో ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోననే చర్చ మొదలైంది. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక వనరుల సమీకరణ ఛాలెంజ్‌గానే ఉంటుంది. పన్నులు వేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత, పెంచకుంటే ఆదాయం రాకపోవడం లాంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితిని సీఎం కేసీఆర్ ఏ విధంగా నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story