ఐదేండ్ల బాలుడి పెద్ద మనసు

by Shyam |   ( Updated:2020-07-29 02:18:33.0  )
ఐదేండ్ల బాలుడి పెద్ద మనసు
X

దిశ, వెబ్‌ డెస్క్: ఐదేండ్ల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు..స్నేహితులతో కలిసి ఆడుకుంటారు. అల్లరి చేస్తారు. తమ లోకంలో ఆనందంగా జీవిస్తారు. కానీ, ఈ ఐదేండ్ల పిల్లాడు అనీశ్వర్ ప్రపంచం గురించి ఆలోచించాడు. తోటివారికి సాయం చేయాలనకున్నాడు. పది మంది కష్టాల్లో పాలుపంచుకోవాలనుకున్నాడు. అందుకోసం సైక్లింగ్ చేస్తున్నాడు. ఇది అందరూ పిల్లలు చేసేదే కదా! అందులో పెద్ద వింతేమి ఉంది అంటారా! అనీశ్వర్ సరదా కోసం సైక్లింగ్ చేయడం లేదు.. కొవిడ్-19 బాధితులకు విరాళాలు అందించేందుకు సైక్లింగ్ చేస్తున్నాడు. ఆ బాలుడి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అనీశ్వర్..మాంచెస్టర్‌లో అందరి చిన్నారుల్లానే ఆనందంగా తన ప్రపంచంలో జీవించేవాడు. ఒక్కసారిగా ఆ ప్రపంచమంతా దూరమైంది. స్కూళ్లు మూతపడ్డాయ్. స్నేహితులు ఇల్లు దాటడం లేదు. గతంలోలాగా ఆడుకోవడానికి ఎక్కడికీ వెళ్లడం లేదు. మనుషులు కూడా ఎక్కడా ఎక్కువగా కనిపించడం లేదు. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, పార్కులు అన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇంతకుముందున్న పరిస్థితులకు ఇప్పటికీ వచ్చిన తేడాను నిశితంగా గమనించాడు. దీనికి కారణం కరోనా అని తెలుసుకున్నాడు. కొవిడ్ మహమ్మారి వల్ల ఎంతో మంది చనిపోతున్నారని, మరెంతో మంది తిండికూడా లేక బాధపడుతున్నారని తెలుసుకుని అనీశ్వర్‌ ఆలోచనలో పడ్డాడు. ఎంతో ఆవేదన చెందాడు. వారికి ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. కానీ, ఏం చేయాలో అర్థం కాలేదు.

యూకేకు చెందిన థామస్ మూర్ అనే వందేండ్ల వృద్దుడు అనీశ్వర్‌కు స్ఫూర్తిగా నిలిచాడు. సెంచరీ వయసులో తన ఇంటి చుట్టూ 100 సార్లు నడిచి రూ.200 కోట్లకు పైగా విరాళాలు సేకరించాడు మూర్. అనీశ్వర్‌కు మూర్ బాటలో ఓ కొత్త మార్గం కనిపించింది. తాను కూడా విరాళాలు సేకరించాలని నిశ్చయించుకున్నాడు. అందుకు అనీ తల్లిదండ్రులు కూడా మద్ధతిచ్చారు. అనీ సైక్లింగ్ ఆలోచనకు.. తన స్నేహితులు 60 మంది జతకట్టారు. అందరూ కలిసి 3,200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి ఏకంగా రూ.3.7 లక్షల విరాళాలు సేకరించాడు.

అనీశ్వర్ చేసిన పనిని స్థానికులే కాదు యూకేకు చెందిన ఎంతోమంది బ్రిటీష్ పొలిటీషియన్స్, పారిశ్రామికవేత్తలు, సెలెబ్రిటీలు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ బ్రిటీష్‌ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్ అనీశ్వర్‌ను అతడి తల్లిదండ్రులను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఆయనే ఈ చిన్నోడు చేసిన పనిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దాంతో అనీశ్వర్ యూకేలో స్టార్‌గా మారిపోయాడు. వారింగ్టన్ సౌత్ ఎంపీ ఆండీ కార్డర్ కూడా అనీని అభినందించాడు. ఆగస్టు 6న అనీని ప్రత్యేకంగా కలిసి అభినందించనున్నాడు. తాను సేకరించిన మొత్తాన్ని అనీశ్వర్ భారత్‌కు అందించనున్నాడు. తదుపరి ఇంగ్లాండ్‌కు సాయం చేసేందుకు ఓ క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన అనీశ్వర్ తల్లిదండ్రులు కొన్ని ఏండ్ల నుంచి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో నివాసముంటున్నారు.

Advertisement

Next Story