హమ్మయ్యా… ఎలాగైతేనేం? వచ్చేశారు..!

by srinivas |
హమ్మయ్యా… ఎలాగైతేనేం? వచ్చేశారు..!
X

గుజరాత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 4000 మంది చిక్కుకుపోయారంటూ గత కొంత కాలంగా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఉత్తరాంధ్ర మత్స్య కారులపై సానుభూతి వ్యక్తమయింది. వారి రక్షణ కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి లేఖ రాస్తే… సీఎం జగన్ నేరుగా ఫోన్‌లో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపించాలని కోరారు. అయితే వారి అభ్యర్థనలను మన్నించిన ఆయన వారిని పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ నేపథ్యంలో అక్కడి అధికారులతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు సమన్వయం ఏర్పాటు చేసుకుని మత్స్యకారులను విడతల వారీగా తీసుకువస్తున్నారు. ఈ రోజు మొత్తం 12 బస్సుల్లో ఆంధ్రప్రదేశ్‌కి 887 మంది మత్స్యకారులు చేరుకున్నారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్దకు మత్స్యకారులు చేరుకున్నారు. వారికి జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను స్వాగతం పలికారు. చెక్‌పోస్టు వద్ద మత్స్యకారులకు టిఫిన్‌, తాగునీరు అందించారు.

887 మంది మత్స్యకారుల్లో శ్రీకాకుళానికి చెందిన 700 మంది మత్స్యకారులు ఉండగా, విజయనగరం జిల్లాకు చెందిన 98 మంది మత్స్యకారులు, విశాఖ జిల్లాకు చెందిన 77 మంది మత్స్యకారులు ఈ బస్సుల్లో రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు… లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనుభవించిన దుర్భర పరిస్థితులను కళ్లకు కట్టారు. తినడానికి తిండి దొరకక తీవ్ర ఇక్కట్ల పాలయ్యామని చెప్పారు. అనారోగ్యం పాలై కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ క్రమంలో వారికి తలా 2000 రూపాయలు ఇచ్చి స్వస్థలాలకు అధికారులు పంపుతున్నారు.

Tags: andhra pradesh, fishermen, gujarat, return to home

Advertisement

Next Story