యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు: మంత్రి జగదీశ్ రెడ్డి

by Shyam |
యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు: మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, నల్లగొండ: యాసంగిలో దిగుబడి ఎక్కువగా రావడంతో జిల్లాలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ళు, వానాకాలం పంటకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ అమలుపై మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ గ్రామాల్లో కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాగ్ చేసి మిల్లులకు పంపించాలని, అక్కడ జాప్యం లేకుండా ధాన్యం అన్‌లోడ్ చేయాలన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మిల్లులకు ప్రతిరోజు 6 లక్షల గన్నీ బ్యాగులు వస్తున్నాయని, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ. 200 కోట్లు చెల్లించామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల నర్సింహయ్య, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ అబ్దుల్ అలీం తదితరులు పాల్గొన్నారు.

మే 10 నుంచి ఎరువులు, విత్తనాల పంపిణీ

వానాకాలం సాగుకు సంబంధించి ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చూడాలని అధికారులను మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు. అందుకు ఎరువులు, విత్తన కేటాయింపుపై వ్యవసాయ అధికారితో సమీక్ష నిర్వహించారు. రైతులకు మే 10 నుంచి ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసేందేకు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో 1,403 క్వింటాళ్ల జీలుగ, 54 క్వింటాళ్ల జనుము విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ రెడ్డి మంత్రికి చెప్పారు. యూరియా 10వేల మెట్రిక్ టన్నులు , కాంప్లెక్స్ ఎరువులు 15వేల మెట్రిక్ టన్నులు గోడౌన్లలో నిల్వ ఉంచినట్టు పేర్కొన్నారు. మే 10 నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, డీలర్ల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

Tags: yasangi, record purchases, minister jagadeesh reddy, 4.23 lacks metric tonns rice

Advertisement

Next Story

Most Viewed