'ధరణి' జవాబుల్లేని 36 ప్రశ్నలు

by Anukaran |   ( Updated:2021-01-01 04:45:45.0  )
ధరణి జవాబుల్లేని 36 ప్రశ్నలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్.. సర్వరోగ నివారిణి అంటూ ఉన్నతాధికారులు గొప్పలు పలికారు. లక్షలాది మంది సమస్యలు పరిష్కారం కాక సతమతమవుతుంటే అంతా బాగుందని చెప్పేవారు. అత్యద్భుతమని, ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి మెరుగైన వెబ్​పోర్టల్ లేదంటూ పలికేవారు. అంతా బాగుందని, ధరణి సత్ఫలితాలను ఇస్తోందంటూ సీఎం కేసీఆర్‌కు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు గురువారం ప్రగతి భవన్​ సమీక్షా సమావేశంలో తేటతెల్లమైంది. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు పడుతోన్న ఇబ్బందుల జాబితా పెద్దదిగానే ఉంది. సీఎం కేసీఆర్, ధరణి పోర్టల్​సమస్యల పరిష్కారానికి నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమక్షంలో సమస్యలను కలెక్టర్లు ఏకరువు పెట్టినట్లు తెలిసింది.

ధరణి పోర్టల్​ద్వారా సత్వర సర్వీసులు అందించేందుకు సాంకేతిక సమస్యలే అడ్డొస్తున్నాయని ఫిర్యాదు చేశారు. వాటితో పాటు మంత్రులు అడిగిన ధరణి పోర్టల్‌కు సంబంధించిన ఏ ప్రశ్నకు ఉన్నతాధికారుల దగ్గరి నుంచి సమాధానం రాలేదని విశ్వసనీయంగా తెలిసింది. ఇన్ని సమస్యలు ఉంటే తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సీఎం కేసీఆర్ మండిపడినట్లు సమాచారం. ఇంత కాలం ఉన్నతాధికారులు అంతా బాగుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదని ప్రభుత్వం భావించింది. సమీక్షా సమావేశంలో క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన కలెక్టర్లను కూడా ఆహ్వానించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముందుగానే ధరణి సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్‌తో చర్చ అని తెలియడంతో అన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రతి అంశాన్ని సీఎం కేసీఆర్​ముందు ఉంచారు. ప్రధానంగా మ్యుటేషన్లు, స్లాట్​బుకింగ్స్, పట్టాదారు పాసు పుస్తకాల జారీ, నాలా మార్పిడి, తప్పొప్పుల సవరణలు, కోర్టు తీర్పుల అమలు వంటి వాటిని అమలు చేసేందుకు గ్రేట్ ధరణి పోర్టల్​సపోర్టు చేయడం లేదని స్పష్టమైంది.

కొద్ది రోజుల క్రితం రియల్టర్లతో సమావేశమైన సబ్​కమిటీకి కూడా క్షేత్ర స్థాయిలో తలెత్తిన అవరోధాలు అర్థమయ్యాయి. సమీక్షలో మంత్రులు కూడా కొన్నింటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ధరణి పోర్టల్​రూపకల్పన, అమలు బాధ్యతను చేపట్టిన చీఫ్​సెక్రెటరీ సోమేశ్​కుమార్‌తో పాటు సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ ​ఐఏఎస్​అధికారులు కూడా పరిష్కార మార్గాలను చూపలేదని విశ్వసనీయంగా తెలిసింది. అందుబాటులోకి తీసుకొచ్చిన సేవల కంటే ఆప్షన్లు లేని అంశాలే అధికంగా ఉన్నాయి. మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగితే సమస్యలు జఠిలమయ్యేవి. జనం నుంచి ఆగ్రహావేశాలు తీవ్రమయ్యేవి. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని ఆదేశాలైతే ఇచ్చారు. వాటిని కూడా అమలు చేయడంలో ఏ మాత్రం జాప్యం చేసినా ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది. తహసీల్దార్​స్థాయి అధికారులు కార్యాలయాల్లో పని చేయలేని దుస్థితి నెలకొంటుందని రెవెన్యూ చట్టాల నిపుణులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మ్యుటేషన్లలో అనేక సమస్యలు

* ధరణిలో పెండింగ్ మ్యుటేషన్లు చేసేందుకు ఇబ్బందులు. ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ స్లాట్స్ బుకింగ్ కావడం లేదు.
* సాగు భూములను సాదాబైనామాలకు ఎలాంటి ప్రొసీడింగ్స్ జారీ చేయలేదు. మ్యుటేషన్ చేసేందుకు ఆప్షన్స్ ఇవ్వాలి.
* సుప్రీంకోర్టు, హైకోర్టు, దిగువ కోర్టులు ఇచ్చే తుది తీర్పులను అమలు చేసేందుకు ఆప్షన్స్ లేవు. సిటిజన్, అఫిషియల్ లాగిన్ ఇవ్వాలి. కోర్టు ఆర్డర్లను అమలు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇవ్వాలి.
* ఇనాం భూములకు సంబంధించిన ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్లను అమలు చేయడం లేదు. ఇంకా సిటిజన్లకు ఆప్షన్లు కూడా ఇవ్వలేదు.
* ప్రభుత్వ భూములను ఎవరికైనా కేటాయిస్తే వారి పేరిట అలైనేషన్ చేసేందుకు ఎలాంటి సదుపాయం లేదు.

రిజిస్ట్రేషన్లలో పెండింగ్ అంశాలు

– అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ, పవర్ ఆఫ్ అటార్నీలను అమలు చేసేందుకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వలేదు. అలాగే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లీజు, పవర్ ఆఫ్ అటార్నీ నిర్వహణ, లీజు, లీజు సరెండర్, లీజు బదిలీ, అవార్డు, సర్టిఫికెట్ ఆఫ్ సేల్, కన్వీయెన్స్ డీడ్, ఎక్స్ఛేంజ్ డీడ్ వంటి వాటిని అమలు చేసేందుకు ఆప్షన్లు కల్పించలేదు.
– సబ్ డివిజన్ నంబర్లకు ఎన్ కంబబరెన్స్ పరిశీలనకు అవకాశం లేదు. ధరణి పోర్టల్‌లో లాగిన్‌కు అవకాశమిచ్చినా కొన్ని సబ్ డివిజన్లకే పరిమితమయ్యాయి.
– కంపెనీలు, సంస్థల పేరిట ఉన్న భూములను ధరణిలో నమోదు చేయలేదు. వారికి ఈ పాస్‌బుక్స్ జారీ చేయలేదు. గతంలోనూ పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయలేదు. కానీ రికార్డుల్లో ఉండేవి. అమ్ముకోవడానికి అనుకూలంగా ఉండేవి. వాళ్లు అమ్ముకోవడానికి కూడా వీల్లేకుండా చేశారు. వాళ్ల నుంచి కొనుగోలు చేసిన వారికి కూడా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ కావడం లేదు.
– ఎన్ఆర్ఐలకు ఆధార్ నంబరు లేదు. వాళ్లు భూములు అమ్ముకునేందుకు వీల్లేకుండా పోయింది.
– మీ సేవా కేంద్రాల్లో ఈసీలు, మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికేట్లు, రిజిస్ట్రర్డ్ డాక్యుమెంట్లను పొందలేకపోతున్నారు. ధరణిలో ఆప్షన్లు ఇవ్వలేదు. మీ సేవా కేంద్రాల్లో ప్రింటెడ్ కాపీలను అందించేందుకు అవకాశం కల్పించాలి.
– పహాణి, ఆర్వోఆర్ 1 బి, పాసు పుస్తకాల వివరాలను పరిశీలించేందుకు అధికారులకు ఆప్షన్లు ఇవ్వాలి.
– వారసుల పేర్లను నమోదు చేసేందుకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వలేదు.
– కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఏదైనా తప్పుగా నమోదు చేస్తే సరి చేసేందుకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వలేదు.
– కొన్ని ప్రభుత్వ భూములను పీఓబీ జాబితాలో పెట్టలేదు. ఇప్పుడు నమోదు చేసేందుకు ఆప్షన్ లేదు.
– రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేస్తుంటే ఎర్రర్ పాప్అప్స్ సిటిజన్ లాగిన్ లో కనిపిస్తున్నాయి. ప్రత్యేక కారణాలేమిటో తెలియదు.
– పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ వంటి సదుపాయాలను కల్పించలేదు.
– మార్ట్‌గేజ్ చేసేటప్పుడు ఆధార్ నంబర్ అడుగుతోంది. బ్యాంకులకు, సంస్థలకు ఆధార్ నంబరు ఉండదు. దాంతో సమస్య అపరిష్కృతంగానే మిగిలింది.
– స్లాట్ క్యాన్సిల్ చేసుకునేందుకు అవకాశం లేదు. ఒక్కసారి ఈ చలాన్ అమౌంట్ కడితే తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. మరోసారి అదే చలాన్ ను వినియోగించుకునే అవకాశం లేదు.
– వారసులతో ఉంటోన్న మైనర్లకు పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసే అవకాశమే లేదు.

తప్పొప్పులకు నో ఛాన్స్

– ఖాస్రా పహాణీ, సేత్వార్ ప్రకారం.. ఖాతాదారులు, పట్టాదారులు, తండ్రి పేరు, నేచర్ ఆఫ్ ల్యాండ్, సర్వే నంబర్లు, విస్తీర్ణం వంటి ఏది తప్పు పడినా సరిదిద్దే వ్యవస్థ లేదు. కలెక్టర్ స్థాయిలో సరిదిద్దేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచిస్తున్నారు.
– మిస్సింగ్ సర్వే నంబర్లకు కొత్త ఖాతాలను రూపొందించేందుకు, ఖాతా అప్డేషన్, సేత్వార్ ఎంట్రీ వంటి సరిదిద్దేందుకు కలెక్టర్లకు అవకాశం ఇవ్వాలి.

నాలాలోనూ కష్టాలే

ఇప్పటి వరకు డిజిటల్ సంతకాలు చేసిన వ్యవసాయ భూముల వరకే పరిమితం చేశారు. సర్వే నంబరులో ఏ భాగం నాలా కన్వర్షన్ చేయాలో పేర్కొనే వీల్లేదు. దానికి సంబంధించిన విలువైన ప్రొసిడింగ్స్ జారీ చేసే వీల్లేదు. దరఖాస్తు చేసుకున్న భూమి ఎక్కడ ఉన్నదో చూడకుండానే ఆమోదం తెలపాల్సి వస్తోంది.

Advertisement

Next Story

Most Viewed