రైతులకు శుభవార్త.. 311 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

by Shyam |   ( Updated:2021-10-20 07:13:16.0  )
రైతులకు శుభవార్త.. 311 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
X

దిశ, మెదక్ : గత యాసంగిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్ల కోసం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వానాకాలం పంట కోతలు మొదలైనందున రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు గురువారం నుండి జిల్లాలో 311 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామని, అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, తేమను కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 147 రా రైస్, బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యం తరలించే విధంగా ట్రాన్స్ పోర్ట్ లారీలకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. రైతుల వారీగా, కేంద్రాల వారీగా పంట వివరాలను కేంద్రం ఇన్చార్జి, వ్యవసాయ విస్తరణాధికారులకు ఇచ్చి ప్రతీ మూడు రోజులకొకసారి సమీక్షిస్తుండాలన్నారు. ధాన్యం రవాణా కోసం ఇద్దరు కాంట్రాక్టర్ల నుంచి 800 లారీలను ఏర్పాటు చేయాలని, మిల్లు వారీగా లేబర్‌ను సమకూర్చాలని సూచించారు. రైతులు తమ సొంత ట్రాక్టర్‌ల ద్వారా ధాన్యం తరలించుటకు అనుమతించాలని, మిల్లు వద్ద లారీలు, ట్రాక్టర్‌ల లైన్లు విడివిడిగా ఉండేలా చూడాలని అన్నారు. ఏ గ్రేడ్ రకం 1960, సాధారణ రకం 1940 మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నందున రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. FCI ధాన్యాన్ని కొనకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఇవ్వడం, మిషన్ కాకతీయ, హల్దీ, కాళేశ్వరం ద్వారా చెరువులు నింపి సాగు నీరందించడం జరిగిందన్నారు. తద్వారా పంట సాగు ఘననీయంగా పెరిగిందని, రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, అడిషనల్ ఎస్పీ కృష్ణ మూర్తి, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్ఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, మార్కెటింగ్ శాఖా సహాయ సంచాలకులు రియాజ్, డీసీఓ కరుణ, లీగల్ మెట్రాలజీ పాల్గొన్నారు.

Advertisement

Next Story