రాష్ట్రంలో లోకల్ కోటా @25%

by  |
రాష్ట్రంలో లోకల్ కోటా @25%
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25% కోటాను కేటాయించారు. మిగిలిన 75శాతం సీట్లను ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో నింపుకునేందుకు యూనివర్సిటీలకు పూర్తి అధికారం ఉంది. రాష్ట్రంలో ఉన్నత విద్యావకాశాలు మెరుగుపర్చేందుకు తీసుకొస్తున్నామంటున్న వర్సిటీల్లో స్థానిక విద్యార్థుల కోటాను 25 శాతానికి పరిమితం చేయడం వల్ల సర్కారు ఉద్దేశం ఎలా నేరవేరుతుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో ఎనిమిది ప్రైవేటు యూనివర్సిటీలకు సర్కారు ఆమోదం లభించగా.. మొదటి విడతలో ఐదింటికి అనుమతినిచ్చింది. తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపన, నియంత్రణ సవరణ బిల్లును సోమవారం శాసనసభలో ఆమోదించారు.

బిల్లు ప్రవేశపెట్టిన విద్యాశాఖ మంత్రి..

బిల్లు ప్రవేశపెడుతూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేటు యూనివర్సిటీలతో నాణ్యమైన విద్య, పరిశోధాత్మక బోధన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీపడేందుకు విద్యార్థులకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వ యూనివర్సిటీలతోపాటు ప్రైవేటు యూనివర్సిటీలు ఉంటే విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని సర్కారు భావిస్తోందన్నారు.

2018లో తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపన, నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. జీవో 17 ద్వారా 2019 జూలై 17న అమల్లోకి వచ్చినట్లు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న సవరణలు చేసి గవర్నర్ ఆర్డినెన్స్ అమల్లోకి తెచ్చామన్నారు. ఇప్పుడు సభకు సమర్పించిన బిల్లు ఆర్డినెన్స్ స్థానంలో సమర్పించినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేటు యూనివర్సిటీలో ఏర్పాటులో మన రాష్ట్రం 25వ స్థానంలో ఉందని చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీల చట్టం ప్రకారం రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు కానున్నాయి.

ఈ ఐదింటిలో.. సదాశివపేటలోని ఓక్స్‌సెన్, దూలపల్లిలోని మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్‌లోని మహీంద్రా, ఘట్కేసర్‌లోని అనురాగ్, వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు కోసం తెలంగాణ ఉన్నత విద్యామండలికి రెడ్‌క్లిఫ్, అమిటీ యూనివర్సిటీలతో కలిపి 16 దరఖాస్తులు అందగా.. ఐదింటిని ఫైనల్ చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మైక్ కట్..

బిల్లుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలని కోరారు. సర్కారు అనుమతించిన యూనివర్సిటీలకు చెందిన భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. మూడు యూనివర్సిటీలు అధికార పార్టీకి చెందినవారివే ఉన్నాయంటూ కొనసాగిస్తుండగా.. సమయం అధికమైందంటూ స్పీకర్ పోచారం మైక్ కట్ చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఎలాంటి లోపాలున్నాయో గుర్తించి, సవరించాలి తప్ప, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతివ్వడానికి అంత ఉత్సాహం ఎందుకని ప్రశ్నించారు.

విద్యార్థుల డిమాండ్ మేరకే..

విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. బిల్లుపై సభ్యుల ప్రశ్నల, సలహాల అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం 16 దరఖాస్తులు రాగా, నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం 9 మాత్రమే ప్రభుత్వానికి అందాయన్నారు. మొదటి దశలో ఐదింటికి అనుమతించామని, మూడు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు.

ప్రైవేట్ యూనివర్సిటీల్లో 25 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలన్నారు. ఒకవేళ సాధ్యం కాకపోతే తెలంగాణలో రెండేండ్లు పనిచేసిన తల్లిదండ్రుల పిల్లలను కూడా ఈ కేటగిరీలో అవకాశం కల్పించాలని చెప్పారు. వీసీల నియామకంలో లీగల్ సమస్యలు వచ్చాయని, యూనివర్సిటీల్లో ఖాళీలను నింపేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందన్నారు. అయితే, కోర్టు కేసు నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేయలేదన్నారు.


Next Story

Most Viewed