23 రకాల విజయ ఉత్పత్తులు విడుదల

by Shyam |   ( Updated:2021-08-23 08:32:08.0  )
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: విజయ ఆయిల్ సంస్థ మార్కెట్‌లోకి 23 రకాల ఉత్పత్తులను విడుదల చేసింది. నూనె ఉత్పత్తులతో నూతనంగా ఆహార ఉత్పత్తలను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టారు. సోమవారం టూరిస్ట్ ప్లాజాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నూతన ఉత్పత్తులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీలేని ఆహార ఉత్పత్తుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నాణ్యమై నూనె, ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్న విజయ బ్రాండ్ ఉత్పత్తులను ఆదరించాలని కోరారు. ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల కోసం పంటల ఉత్పత్తులలో రసాయనాలు, ఎరువులను తగ్గించేందుకు రైతులను చైతన్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

తెలంగాణ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ టర్నోవర్ రూ.200 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.700 కోట్లకు చేరుకుందని, నికరలాభం రూ.57 కోట్లుగా ఉందని తెలిపారు. ఆయిల్ ఫెడ్ లాభాల బాటలో నడిచేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 22 మిలియన్ టన్నుల నూనె వినియోగిస్తుంటే కేవలం 7 మిలియన్ టన్నులే ఉత్పత్తి అవుతుందని వివరించారు. దాదాపు రూ.80 వేల కోట్లను వంటనూనెల దిగుమతి కోసం వెచ్చిస్తున్నామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed