ICC World Cup 2023: కండలు చూపించిన రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

by Vinod kumar |   ( Updated:2023-10-15 11:02:22.0  )
ICC World Cup 2023: కండలు చూపించిన రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్‌ బౌలర్లకు హిట్‌మ్యాన్‌ చుక్కలు చూపించాడు. ఓవరాల్‌గా 63 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌ 15 ఓవర్‌లో పాక్‌ స్టార్‌​ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ వేసిన తొలి బంతిని రోహిత్‌ శర్మ భారీ సిక్సర్‌గా మలిచాడు. 141.1 కి.మీ వేగంతో వేసిన బంతిని హిట్‌మ్యాన్‌ తన ట్రేడ్‌మార్క్‌ ఫుల్‌ షాట్‌ ఆడాడు. ఇది చూసిన అందరూ ఆశ్యర్యపోయారు. ఫీల్డ్‌ అంపైర్‌ ఎరాస్మస్ సైతం షాక్‌కు గురయ్యాడు.

ఈ క్రమంలో రోహిత్‌ దగ్గర వెళ్లిన ఎరాస్మస్‌.. ఎటువంటి భారీ షాట్లు ఎలా ఆడుతున్నారని ప్రశ్నించాడు. అందుకు బదులుగా రోహిత్‌ నవ్వుతూ తన కండలు చూపించాడు. మ్యాచ్ అనంతరం బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్‌తో మాట్లాడిన రోహిత్‌.. "ఇదే విషయంపై స్పందించాడు. అంత ఈజీగా సిక్సర్లు కొడుతున్నావని అంపైర్‌ నన్ను అడిగాడు. అది బ్యాట్ పవరా అని అన్నాడు. అందుకు బదులుగా కాదు అది నా పవర్‌ అని చెప్పా" అని రోహిత్‌ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story