ICC World Cup 2023: న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్ మ్యాచ్.. 'ఆ నలుగురు మనోళ్లే'

by Vinod kumar |
ICC World Cup 2023: న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్ మ్యాచ్.. ఆ నలుగురు మనోళ్లే
X

న్యూఢిల్లీ : న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నలుగురు భారత సంతతికి చెందిన క్రికెటర్లు ఆడారు. న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రచిన్ రవీంద్ర.. నెదర్లాండ్స్‌ తరఫున ఆడుతున్న విక్రమ్‌జిత్ సింగ్, ఆర్యన్ దత్, తేజ నిడమనూరు భారత్‌తో సంబంధం ఉన్న క్రికెటర్లే.. అందులో తేజ నిడమనూరు తెలుగు కుర్రాడు కావడం మరో విశేషం. విజయవాడకు చెందిన అతను.. చిన్నతనంలోనే న్యూజిలాండ్‌కు వెళ్లాడు. 2017-19 మధ్య అతను ఆక్లాండ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. అనంతరం నెదర్లాండ్స్‌కు వెళ్లిన తేజ ఓ క్రికెట్ క్లబ్‌‌కు ప్రాతినిధ్యం వహించాడు. జాతీయ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడ్డాడు. గతేడాది వెస్టిండీస్‌పై నెదర్లాండ్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే, ప్రపంచకప్ జట్టులోనూ చోటు పదిలం చేసుకున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో 5 పరుగులు చేసి నిరాశపర్చిన అతను.. న్యూజిలాండ్‌పై 21 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇప్పటి వరకు అతను 22 వన్డేలు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

అలాగే, నెదర్లాండ్స్ ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ కూడా భారత్ సంతతికి చెందినవాడే. 2003లో పంజాబ్‌ రాష్ట్రం, చీమా ఖుర్ద్‌లోని ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతని తాత ఖుషీ చీమా 1984‌లో నెదర్లాండ్స్‌కు వెళ్లి ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు తరుచుగా భారత్‌కు వచ్చి వెళ్తూ ఉండేవారు. అయితే విక్రమ్‌జీత్‌కు 7 ఏళ్ల వయసులో అతని కుటుంబం పూర్తిగా నెదర్లాండ్స్‌కు మారింది. 11 ఏళ్ల వయసులో క్రికెట్‌ వైపు మళ్లిన విక్రమ్‌జీత్‌.. 15 ఏళ్ల వయసులో నెదర్లాండ్స్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో మొదట టీ20 క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతను.. మూడేళ్ల తర్వాత గతేడాది మార్చిలో న్యూజిలాండ్‌పై వన్డే అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జట్టులో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు.

వరల్డ్ కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విక్రమజీత్(52) హాఫ్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 27 వన్డేలు ఆడిన అతను.. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 872 పరుగులు చేశాడు. అలాగే, నెదర్లాండ్స్ స్పిన్నర్ ఆర్యన్ దత్ కూడా భారత మూలాలు ఉన్న క్రికెటరే. ఆర్యన్ దత్ కుటుంబం పంజాబ్‌లో ఉండేది. అతని తల్లిదండ్రులు 1980లో నెదర్లాండ్స్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఈ 20 ఏళ్ల కుర్రాడు క్రికెట్ కెరీర్ 9 ఏళ్ల వయసులో మొదలైంది. 2011లో భారత్ వన్డే వరల్డ్ కప్ గెలవడం ద్వారా ప్రభావితమైన అతను.. క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు.

13 ఏళ్ల వయసులో చండీఘడ్‌లో కూడా శిక్షణ తీసుకున్నాడు. 2021లో నెదర్లాండ్స్ తరఫున అరంగేట్రం చేసిన అతను.. జాతీయ జట్టు తరఫున 27 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక వికెట్ తీసిన అతను.. న్యూజిలాండ్‌పై 2 వికెట్లు దక్కించుకున్నాడు. భారత్‌తో సంబంధం ఉన్న మరో ఆటగాడు రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్‌కు ఆడుతున్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్ మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. అతను వెల్లింగ్టన్‌లో జన్మించినా.. అతని తల్లిదండ్రులు భారతీయులే. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి స్వస్థలం బెంగళూరు. రవి కృష్ణమూర్తి సైతం బెంగళూరులో క్లబ్ లెవల్ క్రికెట్ ఆడాడు.

అయితే ఉద్యోగం కారణంగా కృష్ణమూర్తి న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. న్యూజిలాండ్‌లోనే జన్మించిన రచిన్ రవీంద్ర క్రికెట్‌పై అడుగులు వేశాడు. 2021లో అతను టీ20 జట్టులోకి వచ్చాడు. అదే ఏడాది టెస్టుల్లోకి.. ఈ ఏడాది మార్చిలో శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేశాడు. రచిన్ మొదట ప్రపంచకప్ ప్రణాళికల్లో లేడు. అయితే, మరో స్పిన్ ఆల్‌రౌండర్ బ్రాస్‌వెల్ గాయపడటంతో అతని స్థానంలో రచిన్‌కు అవకాశం దక్కింది. బంతితోపాటు బ్యాటుతోనూ సత్తాచాటే రచిన్ రవీంద్ర.. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో వచ్చి అజేయ శతకంతో చెలరేగాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించాడు.

Advertisement

Next Story

Most Viewed