బ్రేకింగ్: భారీ వర్షాలతో ద్వీపాలను తలపిస్తున్న 20 గ్రామాలు..

by Anukaran |   ( Updated:2021-09-06 06:28:13.0  )
బ్రేకింగ్: భారీ వర్షాలతో ద్వీపాలను తలపిస్తున్న 20 గ్రామాలు..
X

దిశ, ములకలపల్లి: సోమవారం తెల్లవారు జామునుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములకలపల్లి మండలంలోని 20 ఆదివాసీ గ్రామాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వరదల కారణంగా వాగులు, వంకలు స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. మూకమామిడి ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయి నీటి మట్టం రావడంతో అలుగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. పూసుగూడెం తెల్ల చెరువు అలుగు మూలంగా రైతువేదిక కు నిర్మాణం చేసిన రోడ్డు పూర్తిగా తెగిపోయింది.

– ద్వీపాలను తలపిస్తున్న గ్రామాలు

మండలంలోని సుమారు 20కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోహయి. ఆయా గ్రామాలకు వెళ్లే రహదారులకు వాగులపై నిర్మించిన లోలేవల్ వంతెనలు ప్రమాద స్థాయికి మించి ప్రవహించడంతో బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయి ద్వీపాలను తలపిస్తున్నాయి. కమలాపురం, చాలమంనగర్ గ్రామాలను మూడు వాగులు చుట్టుముట్టాయి. రాకపోకలకు ఎలాంటి అవకాశం లేక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొగరాలగుప్ప గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న పాములేరు వాగు బ్రిడ్జి పై ప్రమాద స్థాయిని మించి వరద నీరు ప్రవహిస్తోంది. ముత్యాలంపాడు, మోటాగూడెం వాగుల ఉధృతికి రెండు గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు ఎనిమిది ఆదివాసీ గ్రామాలు ఇబ్బందులు పడుతున్నాయి.

గంగారం పంచాయితీ పరిధిలో వాగొడ్డు గుంపు, అల్లిగుంపు, చపరాలపల్లి-కుమ్మరిపాడు గ్రామాల మధ్య పూర్తి స్థాయిలో సంబంధాలు తెగిపోయాయి. సీతారామపురం పంచాయతీలోని అన్నారం, చింతలపాడు గ్రామాలు వరదల్లోనే ఉన్నాయి. ములకలపల్లి- తాళ్లపాయ పంచాయితీకి మధ్యలో ఉన్న పాములేరు బ్రిడ్జి పైనుంచి వరదనీరు ప్రవహిస్తుంది. దీనితో పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఇలా మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గ్రామాలు ద్వీపాల మాదిరి వరదల్లో చిక్కుకొని ఉన్నాయి.

– పర్యవేక్షిస్తున్న అధికారులు

వరదల మూలంగా ఏర్పడ్డ పరిస్థితులను స్థానిక తహసీల్దార్ వీరభద్రం, ఎస్సై సురేష్, ఎంపీడీఓ ఆర్ చిన్న నాగేశ్వరరావులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తక్షణం సమాచారం ఇవ్వాలని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులను ఆదేశించారు. స్థానిక ఎస్సై సురేష్ తన సిబ్బందితో ముత్యాలంపాడు, తాళ్లపాయ వాగుల వద్దకు వెళ్లి స్థానికులతో మాట్లాడారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవ్వరూ వాగుల్లో దిగే సాహసం చేయొద్దని కోరారు.

Advertisement

Next Story