రెండు నెలల పవర్ బిల్ రూ.7లక్షలు..

by Shyam |
రెండు నెలల పవర్ బిల్ రూ.7లక్షలు..
X

దిశ, నిజామాబాద్:
సాధారణంగా కరంట్ షాక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కసారి ఎవరినైనా తాకిందంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే..కానీ, ఓ ఇంటి యాజమానికి కరంట్ షాక్ ఈసారి బిల్లు రూపంలో వచ్చింది. అది చూశాక ఆశ్చర్యపోవడం అతని వంతయ్యింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. కరోనా నేపథ్యంలో ఇన్నిరోజులు ప్రభుత్వం బిల్లులు వసూలు చేయలేదు.ఒకే సారి రెండు నెలలకు సంబంధించిన బిల్లులను ఇప్పుడు వసూలు చేస్తున్నారు. సాధారణంగా ఓ ఇంట్లో మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు మాత్రమే నడిస్తే ప్రతి నెలా రూ. 5వందల మేర మాత్రమే విద్యుత్ బిల్లు రావాలి. కానీ, ఈ నెల రూ.7లక్షలకు పైగా రావడంతో ఆ ఇంటి యజమాని అవాక్కయ్యాడు. కామారెడ్డి జిల్లా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అందుకు కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..జిల్లాలోని కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన గాండ్ల శ్రీనివాస్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంట్లో మూడు బల్బులు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి నెలా రూ.500ల కరెంట్ బిల్లు వస్తుంది. గత ఫిబ్రవరి నెలలో రూ.415 విద్యుత్ బిల్లు చెల్లించాడు. మార్చి, ఏప్రిల్, మే నెలలో కరోనా వల్ల విద్యుత్ బిల్లులు రాలేదు. ఈ నెల వచ్చిన విద్యుత్ బిల్లులో వెయ్యి కాదు, రెండు వేలు కాదు.. ఏకంగా రూ.7లక్షల 29 వేల 471 బిల్లు వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఇంటి యజమాని ఈ బిల్లు ఏ విధంగా చెల్లించాలో మీరే చెప్పండంటూ అధికారులను ప్రశ్నించాడు.ఇంత మొత్తం తాను చెల్లించలేనని, విద్యుత్ అధికారులు చొరవ చూపి తనకు న్యాయం చేయాలని కోరాడు.

Advertisement

Next Story