లోన్ యాప్ కేసులో చైనీయుడి అరెస్టు.. రూ.28 కోట్లు సీజ్

by Anukaran |
లోన్ యాప్ కేసులో చైనీయుడి అరెస్టు.. రూ.28 కోట్లు సీజ్
X

దిశ, క్రైమ్ బ్యూరో : లోన్ యాప్ వ్యవహారంలో రాచకొండ పోలీసులు మహారాష్ట్రలోని థానే నగరంలో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు చైనా దేశస్తుడు హె జైన్ అలియాస్ మార్క్ కాగా, మరొకరు వారణాసికి చెందిన వివేక్ కుమార్. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులపై 4 కేసులను నమోదు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి డిసెంబరు 27న పుణెలో ముగ్గురిని అరెస్టు చేయగా, తాజాగా ఇద్దరి అరెస్ట్​ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ కలిసి సీపీ మహేష్ భగవత్ బుధవారం ఎల్‌బీ నగర్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. చైనాకు చెందిన హె జైన్ వ్యాపార వీసాపై 2019 జూలైలో ఇండియాకు వచ్చారు. చైనాకు చెందిన క్సూ నాన్, క్సూ క్చియాంగ్, జావోకివో లోన్​యాప్​ కంపెనీలు థానేలో నిర్వహించే అజయ్ సొల్యూషన్స్, బీయాన్సీ ఇన్ఫర్మేషన్, ఈపోచ్ గో క్రెడిట్, ట్రూ థింగ్ ఫిన్2టెక్ కంపెనీలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు.

రూ.28 కోట్లు ఫ్రీజ్

రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే లోన్ యాప్ కేసులో ఇప్పటికే పుణెలో ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఒకరు చైనాకు చెందిన మహిళ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయా యాప్ నిర్వాహకుల అకౌంట్లలో ఉన్న సుమారు రూ.1.42 కోట్లను ఫ్రీజ్ చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా థానే లోని 4 కంపెనీలపై రాచకొండ పోలీసులు దాడి చేసి చైనాకు చెందిన వ్యక్తితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. యాప్ లోన్ మేనేజ్మెంట్ కు చెందిన పలు బ్యాంకుల అకౌంట్ లలో దాదాపు రూ.28 కోట్లను ఫ్రీజ్ చేసినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన క్రైమ్ డీసీపీ యాదగిరి, అడిషనల్ డీసీపీ డి. శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్, స్పెషల్ టీమ్ ఇన్ స్పెక్టర్లు బి.ప్రకాష్, విజయ్ కుమార్ ను సీపీ అభినందించారు.

Advertisement

Next Story