స్థానిక అంపైర్లు.. తప్పుడు నిర్ణయాలు

by Shyam |
స్థానిక అంపైర్లు.. తప్పుడు నిర్ణయాలు
X

దిశ, స్పోర్ట్స్: కరోనా లాక్‌డౌన్ తర్వాత క్రికెట్ తిరిగి ప్రారంభమైందని సంతోషించాలో ఐసీసీ కొత్త మార్గదర్శకాల వల్ల పర్యాటక జట్టుకు తీరని నష్టం వాటిల్లుతున్నదని బాధపడాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సౌతాప్టంన్‌లోని ఏజెస్ బౌల్ మైదానాన్ని బయో బబుల్ కింద మార్చి ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ నుంచే ఐసీసీ తాత్కాలిక మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దకూడదనేది ఒకటైతే, లాక్‌డౌన్ కారణంగా టెస్ట్ మ్యాచ్‌లో స్థానిక అంపైర్లనే ఉపయోగించుకోవచ్చనేది మరొకటి. ఈ టెస్టులో ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు, ఒక థర్డ్ అంపైర్, మరో ఇద్దరు అంపైర్ల సహా రిఫరీ కూడా ఇంగ్లండ్‌కు చెందిన వాళ్లే. సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లకు న్యూట్రల్ అంపైర్లనే వాడుతారు. కానీ, విదేశీ ప్రయాణాలపై నిషేధం కారణంగా ఇంగ్లండ్ అంపైర్లే మ్యాచ్ నడిపిస్తున్నారు. కాగా, వీళ్లు గత రెండు రోజుల్లో ఐదు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఫీల్డ్ అంపైర్లైన రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఐదు ఎల్బీ నిర్ణయాలు తప్పుగా ఇచ్చారు. ఇవన్నీ డీఆర్ఎస్‌లో అవుట్లుగానే కనిపించినా ‘అంపైర్స్ కాల్’ కారణంగా ఇంగ్లండ్ జట్టు లబ్ధి పొందింది. మరోవైపు విండీస్ ఆటగాళ్లు అవుట్ కాకపోయినా అవుట్ ఇచ్చారు. డీఆర్ఎస్ వల్ల వీళ్లు బతికిపోయారు. మొత్తంగా కెటిల్‌బరో 3, ఇల్లింగ్ వర్త్ 2 తప్పుడు నిర్ణయాలు ప్రకటించడం చర్చనీయాంశమైంది. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో వీళ్లకు మంచిపేరే ఉంది. కానీ, వీరి నిర్థయాలన్నీ ఇంగ్లండ్ జట్టుకు అనుకూలంగా ఉండటం అనుమానాలకు తావిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed