కాళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by Sridhar Babu |   ( Updated:2021-09-29 00:49:45.0  )
కాళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, భూపాలపల్లి : గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణలో వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ వాగులు, వంకలు, చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. నదుల్లో గరిష్ట స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు బుధవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

కాళేశ్వరం వద్ద గోదావరి నది 12.55 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి నది వద్ద 10.9 లక్షల క్యూసెక్కుల నీరు ప్రస్తుతం దిగువకు ప్రవహిస్తోంది. ఈ వరద ప్రభావం అంతా లక్ష్మీ బ్యారేజ్ వైపు మళ్లుతోంది. గోదావరి పరివాహక ప్రాంతం చుట్టు పక్కల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి వైపు ఎవరూ వెళ్లరాదని, పశువులను కూడా వదలకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద ప్రభావం ఎక్కువైంది.

Advertisement

Next Story