వచ్చే రెండేళ్లలో 133 మిలియన్ల ఉద్యోగాలు

by Shyam |
వచ్చే రెండేళ్లలో 133 మిలియన్ల ఉద్యోగాలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: 2022 నాటికి 133మిలియ‌న్ల ఉద్యోగాలు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో వ‌స్తాయ‌ని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అంచ‌నా వేసింది. ఈ అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకునేందుకు నూత‌న శిక్ష‌ణ అంశాల‌ను బుధవారం వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్ టాప్ 50 యూనివ‌ర్సిటీ అయిన యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్‌తో క‌లిసి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌పై శిక్ష‌ణ ఇవ్వ‌నుంది. సైబ‌ర్ సెక్యూరిటీ, డిజిట‌ల్ మార్కెటింగ్‌, ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్ష్‌, రోబోటిక్స్‌పై శిక్ష‌ణ కోసం ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. మెక్సికో ప్ర‌భుత్వ సాంస్కృతిక విభాగం, టీటా క‌లిసి సంయుక్తంగా లాంగ్వేజ్ ఎక్ఛేంజ్‌లో భాగంగా స్పానిష్ లాంగ్వేజ్ శిక్ష‌ణ అందిస్తోంది. మెక్సికో మంత్రి హ‌ర్మండో హెరెరా సిల్వాతో క‌లిసి టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల‌ ఆన్‌లైన్‌లో ఆవిష్క‌రించారు. ఆస‌క్తిక‌ల వారు bit.ly/DigithonAcademy లింకు ద్వారా న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు. వ‌‌ర‌ల్డ్ యూత్ స్కిల్స్ డే పుర‌స్క‌రించుకొని ఇన్నోవేష‌న్‌, ఉమెన్ ఎంట్ర‌ప్రెన్యూర్‌ల‌కు అవార్డులు ప్ర‌క‌టించారు.

యువ నిర్మాణ్ ద్వారా శిక్షణ

ఇప్ప‌టివ‌ర‌కు టీటా చేప‌ట్టిన తెలంగాణ యువ నిర్మాణ్ ద్వారా 1,26,235 మంది విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్ష‌ణ అందించింది. డిజిథాన్ ద్వారా డిజిట‌ల్ లిట‌ర‌సీ పేరుతో 4,65,000 మంది సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కంప్యూట‌ర్ అక్ష‌రాస్య‌త నేర్పించారు. డిజిట‌ల్ యాత్ర పేరుతో హైద‌రాబాద్‌కు చెందిన టెక్కీల‌ను శ‌ని, ఆదివారం తీసుకెళ్లి కంప్యూట‌ర్ స్కిల్స్ పై ప్ర‌భుత్వ పాఠ‌శాలల శిక్ష‌ణ ఇచ్చింది. స‌ర్కారు బ‌డుల్లోనే టెక్కీలు బ‌స చేసి 40,000మందికి వివిధ అంశాలను నేర్పించారు. విదేశాల్లోని పాఠ‌శాల‌ల అనుభ‌వాల‌ను చూపించేందుకు సింగ‌పూర్‌, ద‌క్షిణాఫ్రికా, మెక్సికో వారితో వీడియో కాల్‌తో అనుసంధానం చేశారు. మ‌రో కీల‌క‌మైన విభాగ‌మైన ఇన్నోవేష‌న్స్‌పై ఇప్ప‌టివ‌ర‌కు టెక్నాల‌జీ ఇన్నోవేష‌న్ ఆండ్ ఇంక్యుబేష‌న్ ద్వారా శిక్ష‌ణ ఇచ్చారు. విలేజ్ ఇన్నోవేష‌న్ చాలెంజ్ ద్వారా గ్రామీణ యువ‌కులు త‌మ గ్రామంలోని స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం చూపే అవ‌కాశం దక్కింది. ఆత్మ‌కూరు, అమ‌రచింతలోని దాదాపు 1500మంది యువ‌త‌కు శిక్ష‌ణ పూర్తి చేశారు. వివిధ ర‌కాలైన హ్యాక‌థాన్ ద్వారా 30,000 మందిలోని నైపుణ్యాల‌ను వెలికితీశారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనూ సేవలు

టీటా ఆధ్వర్యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని విద్యార్థులకు రోబోటిక్ స్కిల్స్ పెంపొందించేందుకు రోబోథాన్ నిర్వ‌హించారు. గ‌ద్వాల‌, వ‌న‌ప‌ర్తి, ములుగు జిల్లాల్లో దాదాపు 30,000 మందికి లైన్ ఫాలోవ‌ర్‌, అబ్‌స్టిక‌ల్ డిటెక్ట‌ర్‌, హోం ఆటోమేష‌న్ అంశాల‌పై శిక్ష‌ణ‌ పూర్త‌యింది. దీంతో పాటుగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఇండ‌స్ట్రీ టూర్‌, కాలిఫోర్సియాలోని బ్లాక్ చెయిన్ యూనివ‌ర్సిటీతో క‌లిసి బ్లాక్ చెయిన్ ఇండ‌స్ట్రీ టూర్ ద్వారా దాదాపు 2000 మందికి ఇండ‌స్ట్రీని ప్ర‌త్య‌క్షంగా చూపిస్తూ ప‌రిచ‌యం చేశారు. తెలంగాణ ఎర్లీ కోడ‌ర్స్ పేరుతో ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లోని 8, 9 తరగతి విద్యార్థుల‌కు స్క్రాచ్‌, పైథాన్ ప్రోగ్రామ్‌పై శిక్ష‌ణ పొందారు. దాదాపు 1000 మందికి పైగా ఇలా కోడింగ్ స్కిల్స్ నేర్చుకున్నారు.

Advertisement

Next Story