ఏపీలో కర్నూలులో కేసులు 130: కలెక్టర్

by srinivas |
ఏపీలో కర్నూలులో కేసులు 130: కలెక్టర్
X

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వెల్లడించారు. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 130 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే కోలుకుని ఇంటికి వెళ్లగా… నలుగురు మృత్యువాతపడ్డారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘీ జమాత్‌ మర్కజ్‌లో పాల్లొన్నవారిలోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని ఆయన వెల్లడించారు. కర్నూలులో కరోనా బారినపడి ఒక వైద్యుడు మృతి చెందగా, ఆయన కుటుంబంలోని ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. ఆయన మృతి చెందిన వెంటనే ఆ ఆస్పత్రికి వెళ్లిన వారిపై దృష్టి పెట్టామన్నారు.

10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శాంపిల్స్‌ను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. 1425 శాంపిల్స్‌ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ ఈ రోజు నుంచే ప్రారంభమయిందని ఆయన తెలిపారు. ఆ వైద్యుడ్ని కలిసిన 213 మంది పైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించామని, వారిలో 13 మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. సెకండరీ కాంటాక్ట్‌ అయిన 900 మందిని గుర్తించామని, వారందరికీ కూడా టెస్ట్‌లు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

tags: corona virus, covid-19, ap, kurnool district, collector, veerapandian

Advertisement

Next Story

Most Viewed