దేశంలో కరోనా @ 112359

by vinod kumar |
దేశంలో కరోనా @ 112359
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వ్యాప్తి స్పీడు ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన రెండు రోజులుగా రోజుకు 5 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5609 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 112359కి చేరింది. ఒక్కరోజే 132 మంది కరోనాతో మరణించగా వ్యాధితో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 3435 మందికి చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 45300 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 63624 ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తూనే ఉంది.

మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 2345 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 41642కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 5 రోజులుగా 2వేలకు పైన కేసులు రికార్డవుతున్నాయి. ఇక్కడ ఒక్కరోజే 64 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటివరకు 1454 మంది చనిపోయారు. రాజధాని ముంబైలోని ధారావి మురికివాడలో కొత్తగా47 కేసులు నమోదవగా ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 1425కి చేరింది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ మురికి‌వాడలో కరోనా కారణంగా ఇప్పటివరకు 56 మంది ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో కరోనా శర‌వేగంగా వ్యాపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఒక్కరోజే 776 కొత్త కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 13967కి చేరింది. కొత్తగా నమోదైన 776 కేసుల్లో 567 కేసులు ఒక్క రాజధాని చెన్నై నగరం నుంచే కావడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ కరోనాతో ఒక్కరోజే ఏడుగురు మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 94కు చేరింది. తమిళనాడులో ప్రస్తుతం 5315 యాక్టివ్ కేసులున్నాయి.

గుజరాత్‌లో ఒక్కరోజే 371 కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య12910కి చేరింది. ఇప్పటివరకు గుజరాత్‌లో వ్యాధి సోకి మొత్తం 773 మంది మరణించారు. అటు దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 571 పాజిటివ్ కేసులు నమోదై ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 11659 కి వెళ్లింది. ఢిల్లీలో ఇప్పటివరకు కరోనాతో 194 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 45 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కేసుల సంఖ్య 2452కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 718 యాక్టివ్ కేసులుండగా 1689 మంది ఇప్పటివరకు డిశ్చార్జి అయ్యారు. కరోనాతో కొత్తగా ఒకరు మరణించగా ఏపీలో ఇప్పటివరకు వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 54కు చేరింది.

Advertisement

Next Story