ప్రాణాలకు తెగించి వైద్యం… తల్లి,బిడ్డ క్షేమం

by Anukaran |
ప్రాణాలకు తెగించి వైద్యం… తల్లి,బిడ్డ క్షేమం
X

దిశ, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో 108 సిబ్బంది ప్రాణాలకు తెగించి వైద్య సేవలందించి తల్లీబిడ్డలను కాపాడి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే… కొమరాడ మండలంలోని చోళపదం పంచాయతీ వనదర గ్రామనికి చెందిన పి.జయమ్మ (26) మూడో కాన్పు పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఆమె కుటుంబసభ్యులు సోమవారం ఉదయం 5గంటల 34నిమిషాలకి 108కి ఫోన్ చేశారు. కొమరాడ 108 సిబ్బంది వెంటనే ఆ గ్రామానికి బయల్దేరి వెళ్లారు. అయితే వనదర గ్రామం-కొమరాడ కు మధ్యలో నాగావళి నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉంది.

ఈ క్రమంలో నది దాటి ప్రయాణించలేక 108 వాహనాన్ని వత్తడ గ్రామానికి చేరువలో నాగావళి ఒడ్డున గర్భిణీ బంధువు సూచన మేరకు 6గంటల 15నిమిషాలకి నిలిపారు. కుటుంబ సభ్యులు గర్భిణీని వనదర నుండి నాగావళి నది దాటించుకొని 108 వాహనం దగ్గరకు తీసుకొస్తున్న సమయంలో మార్గమధ్యలోనే ఆమె పాపకు జన్మనిచ్చింది. ఈ సమయంలో 108 సిబ్బందికి, గర్భిణీ బంధువులకు మొబైల్ నెట్వర్క్ లేకపోవడం వలన 108 సిబ్బంది గర్భిణీ దగ్గరకు చేరుకోలేకపోయారు.

మొబైల్ సిగ్నల్స్ వచ్చిన తరువాత 108 సిబ్బంది ప్రసవానికి సంబంధించిన కిట్ తీసుకొని నది ద్వారా నడుచుకొని వెళ్లి… నది మధ్యలో జయమ్మకు ప్రథమ చికిత్స అందించి స్కూప్ స్టెచర్ ద్వారా నెమ్మదిగా నది దాటించి 108 వాహనం ద్వారా కేనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిబిడ్డలను అడ్మిట్ చేశారు. అక్కడ తల్లి,బిడ్డలకు మెరుగైన వైద్యసేవలందించడంతో వారు ప్రమాదం నుంచి బయట పడ్డారు. ప్రాణాలు తెగించి నది దాటుతూ విధులు నిర్వహించిన 108 సిబ్బందికి గర్భిణీ బందువులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 108 సిబ్బంది చిన్నంనాయుడు, పైలట్ శ్రీనివాసరావులకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story