ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఐడెంటికల్ సిస్టర్స్‌గా జపాన్ బామ్మల రికార్డ్!

by Shyam |
oldest twin sisters
X

దిశ, ఫీచర్స్ : జపాన్‌కు చెందిన ఇద్దరు సోదరీమణులు ప్రపంచంలోని అత్యంత వృద్ధులైన ‘ఐడెంటికల్ ట్విన్స్‘ (ఒకేలాంటి కవలలు)గా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో 107 సంవత్సరాల 330 రోజుల వయసున్న ఆ ఇద్దరు జపనీస్ సోదరీమణులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా తాజాగా సర్టిఫికేట్ అందుకున్నారు.

జపాన్‌లో జాతీయ సెలవు దినమైన ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్డ్ డే’ రోజున ఇద్దరు సోదరీమణులు ఈ రికార్డ్ అందుకోవడం విశేషం. జపనీస్ కవల సోదరీమణులు ఉమెనో సుమియమా, కౌమే కోడమా నవంబర్ 5, 1913 న పశ్చిమ జపాన్‌లోని షోడోషిమా ద్వీపంలో జన్మించగా, సెప్టెంబర్ 1, 2021న ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన కవలలుగా రికార్డు సృష్టించారు. గతంలో జపనీస్ కవల సోదరీమణులు కిన్ నారిటా, జిన్ కానీల పేరిటున్న రికార్డ్‌ను ఈ ఇద్దరూ బ్రేక్ చేశారు. వారు మొత్తంగా 11 మంది తోబుట్టువులు కాగా ప్రాథమిక విద్య పూర్తికాగానే వాళ్లు తమ తమ జీవితాల్లో బిజీ అయిపోయారు. కొడమా ప్రధాన ద్వీప ప్రాంతమైన క్యుషు‌కు వెళ్లి స్థిరపడగా, సుమియానా షోడోషిమాలోనే నివసిస్తోంది. అయితే 70 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ ట్విన్ సిస్టర్స్, ఆ తర్వాత కలిసి విహారయాత్రలు వెళ్లడం విశేషం.

ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుర్దాయం కలిగిన పౌరులు జపాన్‌లోనే ఉన్నారు. 65 ఏళ్లు పైబడిన వాళ్లు దాదాపు 29 శాతం మంది ఉండగా, 80,000 మందికి పైగా 100 ఏళ్లు పైబడిన వారున్నారు.

Advertisement

Next Story

Most Viewed