గోల్కొండ ఆసుప్రతిలో 100 కోవిడ్ పడకలు.. సీఎస్

by Shyam |
గోల్కొండ ఆసుప్రతిలో 100 కోవిడ్ పడకలు.. సీఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గోల్కొండ ఆసుపత్రిలో వారం రోజుల్లో 100 కోవిడ్ పడకలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రకటించారు. ప్రతి బెడ్‌కు ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేయాలని వైద్య డైరెక్టర్‌ను ప్రభుత్వ సీఎస్ ఆదేశించారు. శనివారం గోల్కొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన త్వరలోనే అదనంగా 120 పడుకలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ఆసుపత్రి పైభాగంలో కొత్త అంతస్తు నిర్మాణాలు పూర్తి చేసి నెల రోజుల్లో కొత్త పడకలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

ఇతర వసతులను సమకూర్చుటకు ప్రణాళికను రూపొందించాలని గోల్కొండ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆసుపత్రిలో పంపిణీ చేస్తున్న రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను సీఎస్ పరిశీలించి, రెండవ డోస్ తీసుకొనేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వ్యాక్సినేషన్‌కు గరిష్టంగా 15 నిమిషాలు సమయం పడుతుందని, వ్యాక్సినేషన్ అనంతరం మరో 30 నిమిషాలు పరిశీలనలో ఉంచుతున్నట్లు వ్యాక్సినేషన్‌కు వచ్చిన ప్రజలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాక్సిన్ వేయించుకొని 40-45 నిమిషాలలో ఇండ్లకు తిరిగి వెళ్తున్నట్లు వారు తెలిపారు.

మొదటి డోస్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం నాలుగు వారాలు పూర్తి అయిన వ్యక్తులు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం ఆరు వారాలు పూర్తి ఆయిన వ్యక్తులు ఈ నెల 10, 11, 12 తేదీలలో ఏదైనా ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్‌లో రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, జోనల్ కమిషనర్ ప్రావిణ్య, ఎండి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్ రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed