తమిళనాట ఆయన ఇంకా సజీవమే..!

by Shamantha N |
తమిళనాట ఆయన ఇంకా సజీవమే..!
X

చెన్నై: శ్రీలంకలోని గెరిల్లా దళం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టీటీఈ) నాయకుడు వేలుపిళ్లె ప్రభాకరన్ మరణించి పదేళ్లు దాటినా తమిళనాట ఆయన ప్రాభవం తగ్గలేదు. ఇప్పటికీ తమిళుల ప్రతిష్టకు ఐకాన్‌గా భావిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రభాకరన్ ప్రభావాన్ని మరోమారు తెరపైకి తెచ్చింది. ఓటర్లను ఆకర్షించడానికి, ఈలం తమిళుల సమస్యలకు సంఘీభావ ప్రకటనగా రాజకీయ పార్టీలు ఆయన ఫొటోలు, టీషర్టులపై చిత్రాలు, కటౌట్లు, పోస్టర్లను ఉపయోగిస్తున్నాయి. వైకోకు చెందిన ఎండీఎంకే, వీసీకే, ఎన్‌టీకే, పీఎంకే, టీవీకే పార్టీ ర్యాలీల్లో ప్రభాకరన్ చిత్రాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. తమిళుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ప్రభాకరన్‌ను చూస్తుంటారని మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాము మనివణ్ణన్ తెలిపారు. తమ పార్టీ పునాదులే ప్రభాకరన్‌ను అల్లుకుని ఉన్నాయని, ఆయన ఇప్పటికీ యువతను పెద్దమొత్తంలో ఆకర్షిస్తున్నారని ఎన్‌టీకే హెడ్‌క్వార్టర్స్ సెక్రెటరీ కే సెంథిల్ కుమార్ వివరించారు. ప్రభాకరన్ తమ లీడర్ అని, ఆయనపై తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుస్తామని చెప్పారు. లీడర్ వైకో, ఆయన పార్టీ ఎండీఎంకే కూడా ఈలం, ప్రభాకరన్‌కు తమ మద్దతును ఎప్పుడూ బహిరంగపరుస్తుంటారు. కొన్ని పార్టీలు రాజకీయాల్లో లబ్ది కోసం ప్రభాకరన్‌ను వాడుకుంటున్నాయని, ప్రభాకరన్‌తో తమ సంబంధం ఎన్నికలకు అతీతమని వైకో సన్నిహితుడు పీ అరుణగిరి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed