గంటలో.. 33 వంటకాలు

by Shyam |
గంటలో.. 33 వంటకాలు
X

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబ్‌లో చూస్తే.. కొన్ని వందల వంటల చానల్స్ వంటకాల మీదే ఉంటాయి. బుల్లితెర మీద కూడా వంటల ప్రోగ్రామ్స్‌కు మామూలు క్రేజ్ ఉండదు. మాస్టర్ చెఫ్ నుంచి మన ఇంటి వంట వరకు అన్ని ప్రొగ్రాములకు క్రేజ్ ఉంది. అయితే, వంట చేయడం ఈజీయే అనుకుంటారు. కానీ, అంత అషామాషీ విషయమేమి కాదు. ఒక్క వంట చేయాలంటే కనిష్టంగా పది -పదిహేను నిముషాలు తప్పక పడుతుంది. అలాంటిది ఓ పదేండ్ల చిన్నారి గంటలో 33 వంటకాలు చేసి శభాష్ అనిపించుకోవడమే కాకుండా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరానికి చెందిన పదేండ్ల శాన్వి కుకింగ్‌లో ఎక్స్‌పెర్ట్. చిన్నప్పటి నుంచే కుకింగ్‌లో మెళకువలు నేర్చుకుంది. వాళ్ల అమ్మ కూడా వంటలు అదరగొడుతుంది. ప్రముఖ వంటల కాంపిటీషన్‌లో శాన్వి తల్లి ఫైనల్ వరకు వెళ్లింది. తండ్రి వింగ్ కమాండర్‌గా పనిచేస్తారు. తల్లితోపాటు, శాన్వి గ్రాండ్ పేరేంట్స్ శాన్వికి కుకింగ్‌ నేర్పించారు. ఇక తన పాకశాస్ర్త ప్రావీణ్యాన్ని శాన్వి తాజాగా నిరూపించుకుంది. గంటలో ఇడ్లీ, కార్న్ ఫ్రిట్టర్స్, మష్రూమ్ టిక్కా, ఉతప్పం, పనీర్ టిక్కా, ఎగ్ బుల్స్ ఐ, శాండ్‌విచ్, పాప్డి చాట్, ఫ్రైడ్ రైస్, చికెన్ రోస్ట్, పాన్‌కేక్ ఇలా మొత్తంగా 33 వంటకాలు చేసి.. అతి చిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన చిన్నారిగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. శాన్వికి యూట్యూబ్ చానల్ కూడా ఉంది. రుచికరమైన వంటలు ఎలా వండాలో చెబుతూనే, కుకింగ్‌కు సంబంధించిన మంచి మంచి టిప్స్ శాన్వి తన చానల్‌లో అందిస్తోంది. శాన్వి భరతనాట్య కళాకారిణి కూడా.

Next Story