ఆ రాష్ట్రాలు జయిస్తే భారత్ గెలిచినట్టే

by Anukaran |
ఆ రాష్ట్రాలు జయిస్తే భారత్ గెలిచినట్టే
X

న్యూఢిల్లీ: కరోనాకు కళ్లెం వేయడానికి ప్రతి రాష్ట్రం క్రియాశీలంగా వ్యవహరించాలని, కట్టడి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, దేశంలోని 80శాతం యాక్టివ్ కేసులు కేవలం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపారు. ఆ రాష్ట్రాలు కరోనాను నిలువరించగలిగితే భారత్ ఈ మహమ్మారిపై విజయం సాధించినట్టేనని వివరించారు.

అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలు కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. కాగా, ఆర్థిక ప్యాకేజీలపై ఉదారంగా వ్యవహరించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. రాష్ట్ర విపత్తు నిధులు(ఎస్‌డీఆర్ఎఫ్) వినియోగంపై ఆంక్షలు ఎత్తేయాలని అభ్యర్థించారు. కరోనాపై పోరుకు ఈ చర్యలు అవసరమని తెలిపారు.

కరోనా పరిస్థితులను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సీఎంలతోపాటు కర్ణాటక డిప్యూటీ సీఎంలతో ఆయన ఉదయం 11 గంటలకు భేటీ అయ్యారు. దేశంలో యాక్టివ్ కేసులు ఆరు లక్షలను దాటాయని, ఇందులో 80శాతం కేసులు కేవలం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని ప్రధాని అన్నారు. అందుకే కరోనాపై పోరులో ఈ రాష్ట్రాల పాత్ర కీలకమని తెలిపారు. టెస్టింగ్ రేటు స్వల్పంగా, యాక్టివ్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు తప్పకుండా టెస్టులను పెంచాలని అన్నారు.

ముఖ్యంగా తెలంగాణ, బిహార్, గుజరాత్, యూపీ, పశ్చిమ బెంగాల్‌లు టెస్టుల సంఖ్యను పెంచుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని, కరోనా సోకిన వ్యక్తిని గుర్తించి 72 గంటల్లో చికిత్స మొదలుపెడితే వ్యాప్తిని చాలావరకు అడ్డుకోవచ్చునని వివరించారు. కరోనాపై పోరులో కంటైన్‌మెంట్, కాంటాక్ట్ ట్రేసింగ్, సర్వెలేన్స్ కీలకమైన ఆయుధాలని పేర్కొన్నారు. దేశంలో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, రికవరీలు పెరుగుతున్నాయని చెప్పిన ప్రధాని సర్కారు చర్యలు ఫలితాలిస్తున్నాయనడానికి ఇవే నిదర్శనమని తెలిపారు. ఈ ఫలితాలే ప్రజల్లో ధైర్యాన్ని నిలుపుతాయని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed