స్టాక్ ఎక్స్ఛేంజీలో జొమాటో జోరు..

by Harish |
స్టాక్ ఎక్స్ఛేంజీలో జొమాటో జోరు..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైన మొదటిరోజే కొనుగోళ్ల జోరు సాధించింది. కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.76 కాగా, ఏకంగా 53 శాతం ప్రీమియంతో ఒక్కో షేర్ ధర రూ. 116 వద్ద లిస్ట్ అయింది. దీంతో 2020 తర్వాత ఐపీఓకు వచ్చిన సంస్థల్లో 50 శాతం ప్రీమియం లిస్టింగ్‌ సాధించిన 10 కంపెనీల జాబితాలో జొమాటో చేరింది. లిస్ట్ అయిన కొద్ది సమయానికే కంపెనీ షేర్ ధర 62 శాతానికి పెరిగి ఓ దశలో రూ. 138.90 వద్ద ట్రేడయింది. దీంతో జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్ష కోట్ల మార్కును తాకింది.

అలాగే, బీఎస్‌ఈలో అత్యధిక విలువ కలిగిన తొలి 50 కంపెనీల సరసన చేరింది. అనంతరం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ. 126 వద్ద షేర్ ధర ట్రేడయింది. ఫుడ్ డెలివరీ రంగంలో ఐపీఓకు వచ్చిన మొదటి కంపెనీ జొమాటోనే. అంతేకాకుండా జొమాటో ఐపీఓకు రానున్నదనే వార్తలతో మార్కెట్ వర్గాల్లో సానుకూల అంచనాలు జోరందుకున్నాయి. జొమాటో లాభాలు పెద్దగా లేకపోయినప్పటికీ సంస్థలో పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతుండటం మదుపర్లలో ఆసక్తి పెంచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో నిరంతరం పెట్టుబడులను సాధించిన కంపెనీలు వృద్ధి సాధిస్తున్న అంశాన్ని పెట్టుబడిదారులు పరిగణలోకి తీసుకున్నారని, అందుకే జొమాటో ఐపీఓకు ఈ స్థాయిలో స్పందన వచ్చినట్టు నిపుణులు వివరించారు.

Advertisement

Next Story