అధిష్ఠానం అలాగే చెబుతుంది.. మనపని మనదే

by srinivas |
అధిష్ఠానం అలాగే చెబుతుంది.. మనపని మనదే
X

ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక ఎన్నికల కోలాహలం ఊపందుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార విపక్ష పార్టీల నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. నామినేషన్ల గడువు ముగియడంతో ఎవరెవరు నామినేషన్లు వేశారు. ఎవరి గెలుపు ఖాయం, ఏ పార్టీ జిల్లా, మండల పరిషత్‌లను ఏలనున్నాయి? మేయర్ల పీఠాలు ఎవరు దక్కించుకోనున్నారు? అంటూ చర్చ మొదలైంది.

అధికారపార్టీలో గెలుపు ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పలువురు నేతలు తమ పార్టీలో చేరడంతో గెలుపుపై ధీమా కనబడుతోంది. అయితే అధికార పార్టీ నేతలు అధిష్ఠానం మాటలు లెక్కచేయకపోవడం ఏపీలో టాక్ ఆఫ్ ది పోలిటిక్స్‌గా మారింది. ప్రజా ప్రతినిధులు బంధువులు లేదా నియోజకవర్గ సమన్వయకర్తల కుటుంబ సభ్యులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న షరతును ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ నేతలకు విధించారు. వైఎస్సార్సీపీలో జగన్ మాటే శాసనమన్న సంగతి తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మాటలను బేఖాతరు చేయడం ఆశ్చర్యంగా మారింది.

ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం జిల్లా పోలాకి జిల్లా పరిషత్ స్థానానికి మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు కృష్ణచైతన్య నామినేషన్ వేయడం అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరించినట్టైంది. ఎమ్మెల్యే శాంతి రెడ్డి కుమారుడు శ్రావణ్ కూడా హిరమండలం జిల్లా పరిషత్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. విశాఖపట్టణం జిల్లా దేవరాపల్లి జిల్లా పరిషత్ స్థానానికి ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ నామినేషన్ వేయడం అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరించడమేనని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Tags : ysrcp, high command, srikakulam, visakha, krishna chaitanya, shravan, ravi kumar

Advertisement

Next Story

Most Viewed