దూరం పెట్టిందని దడ పుట్టించాడు

by Anukaran |   ( Updated:2020-09-23 07:03:49.0  )
దూరం పెట్టిందని దడ పుట్టించాడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ అమ్మాయిని ప్రేమించాడు.. మరో అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు.. అయినా మాజీ ప్రియురాలిని వదల్లేదు. వేరే అమ్మాయిని పెండ్లి చేసుకున్న ప్రియుడిని మాత్రం ప్రియురాలు క్షమించకుండా.. తనను కాదని వెళ్లినందుకు.. మాటల్లేవ్.. మాట్లాడుకోవడల్లేవ్ అంటూ తేల్చి చెప్పింది. ఆ మాటలకు ఆగ్రహంతో ఊగిపోయిన అతడు ఏకంగా ఓ తుపాకితో వచ్చి గాల్లోకి కాల్పులు చేస్తూ దడ పుట్టించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.

దేశ రాజధాని ఢిల్లీలోని ధరంపాల్ కాలనీలో జరిగిన కాల్పుల ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇదే ప్రాంతానికి చెందిన సుమిత్ తోమర్ అనే వ్యక్తితో ఓ యువతి ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి తిరిగారు.. తీరా పెండ్లి చేసుకునే సమయంలో.. సుమిత్ ప్రియురాలికి హ్యాండ్ ఇచ్చాడు. వేరే యువతిని పెండ్లి చేసుకున్నాడు.

ప్రియుడు మోసం చేశాడన్న బాధతో మాజీ ప్రియురాలు అతడిని దూరం పెట్టింది. దీంతో పలుమార్లు సుమిత్ తనతో మాట్లాడాలని యువతిని వేధించసాగాడు. అయినప్పటికీ ఆమె వినకపోవడం, తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో సుమిత్ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో సదరు యువతి ఇంటి కొచ్చి తుపాకి తీసి గాల్లోకి కాల్పులు చేస్తూ బెదిరింపులు చేశాడు.

అనంతరం ఆలి విహార్ అటవీ ప్రాంతంలోకి మకాం మార్చాడు. భయాందోళనతో బాధితురాలు, కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేసి… ఆలి విహార్ అటవీ ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అతడి చేతికి తుపాకి ఎలా వచ్చిందన్న వ్యవహారం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story