విషాదం.. సెల్ఫీ దిగుతూ వాగులో పడి యువకుడి మృతి

by Shyam |
విషాదం.. సెల్ఫీ దిగుతూ వాగులో పడి యువకుడి మృతి
X

దిశ, జడ్చర్ల : దుందుభి వాగులో నిర్మించిన చెక్ డ్యాంపై సెల్ఫీ దిగుతూ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఆదివారం మిడ్జిల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో దుందుభి వాగు గత రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది.

దీంతో అదే గ్రామానికి చెందిన కుందేళ్ళ శివ ప్రసాద్, తన సమీప బంధువులైన గీత, మాధవిని తీసుకొని ఆదివారం మూడు గంటల ప్రాంతంలో వాగు వద్దకు వెళ్లారు. వాగు వద్దకు చేరుకొని సరదాగా గడిపారు. ఈ క్రమంలో వాగుపై నిర్మించిన చెక్ డ్యాంపై సెల్ఫీ దిగేందుకు శివప్రసాద్(22) ప్రయత్నించి వాగులో పడిపోయాడు.

వాగులో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో శివప్రసాద్ నీటిలో గల్లంతయ్యాడు. వెంటనే గీత, మాధవి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి శివప్రసాద్‌ను కాపాడేందుకు ప్రయత్నించగా చెక్ డ్యాం లోపల ఓ ముళ్ళ చెట్టుకు శివప్రసాద్ మృతదేహం లభించింది. అన్నయ్య తమ కళ్ళ ముందే విగతజీవిగా మారాడని గీత, మాధవి బోరున విలపించారు.

అయితే.. మృతుడి తండ్రి కృష్ణయ్య కొద్ది సంవత్సరాల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు శివప్రసాద్ కూడా చనిపోవడంతో తల్లి యశోద శోకసంద్రంలో మునిగిపోయింది. శివప్రసాద్ జడ్చర్లలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఇంచార్జ్ ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed