- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రాజ్యం' కాఠిన్యం 'న్యాయా'నికి దూరం కావద్దు
దిశ, న్యూస్‌బ్యూరో: ఆసుపత్రిలో బందీగా ఉన్న వరవరరావు 81 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో పోరాడుతున్నారని, జన సంక్షేమం కోసం నడిచే మార్గాల్లో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, రాజకీయపరమైన సిద్ధాంతాలేవైనా మనమంతా మనుషులమేనని, ప్రభుత్వం ఆయనపట్ల దయచూపాల్సిన అవసరం ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి శనివారం రాసిన లేఖలో వరవరరావుతో ఉన్న నాలుగున్నర దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేశారు. “ఎమర్జెన్సీ బాధితులుగా 46 ఏళ్ళ కింద 21 నెలల పాటు మనిద్దరం ముషీరాబాద్ జైల్లో ఉన్నాం. అప్పుడు వరవరరావు కూడా మన సహచరుడు. భావజాలంలో సాహచర్యం లేకపోయినా కటకటాల వెనక మాత్రం మనం కలిసే ఉన్నాం” అని వరవరరావుతో ఉన్న అనుబంధాన్ని కరుణాకర్ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు.
శరీరం మంచానికి కట్టుబడే 81 ఏళ్ళ వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయచూపాల్సిన అవసరం ఉంది. ‘రాజ్యం’ ఇంత కాఠిన్యమా, ‘న్యాయం’ ఇంత సుదూరమా అని ఏ మేధావీ ఈ దేశంలో భావించకూడదని భూమన పేర్కొన్నారు. అహింసయే పరమ ధర్మం, శత్రువును సైతం క్షమించాలి అని విశ్వసించే భారత ఉప రాష్ట్రపతిగా వరవరరావు విడుదల విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని వేడుకున్నారు. అనారోగ్యంతో, అడుగులు తడబడుతూ నిస్సహాయంగా ఉన్న ఓ సిద్ధాంత నిబద్ధ వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులుగా సానుభూతితో కాపాడాలని కోరారు. “యాభై మూడు సంవత్సరాలుగా అడవుల్లో ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవం మంచం పట్టిన వృద్ధుడు సాధించగలడా? ఈ స్థితిలో ఇంకా ఆయనను నిర్బంధంలో ఉంచడం అవసరమా? రాజకీయాలతో సంబంధం లేకుండా మానవాళి మంచికై ఎన్నో కార్యక్రమాలు చేసిన మీరు దయతో ఆలోచించండి” అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి రాసిన ఆ లేఖలో భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.