రేషన్ సరుకుల పంపిణీపై ముందుకా.. వెనక్కా..!

by srinivas |
రేషన్ సరుకుల పంపిణీపై ముందుకా.. వెనక్కా..!
X

దిశ, ఏపీ బ్యూరో : ఇప్పుడు ఇంటింటికీ నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. కొన్నాళ్లు పోతే జొమాటో మాదిరిగా బిర్యానీ, భోజనం కూడా ఇంటింటికీ పంపేట్లున్నారు. ఏమిటీ చాదస్తమంటూ జోకులేసుకునే వాళ్లకు కొదవలేదు. ఎటొచ్చీ రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైఎస్​జగన్​పాదయాత్ర సమయంలో ముసలోళ్లు రేషన్​దుకాణానికి వెళ్లి తెచ్చుకోలేకపోతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. అందువల్ల ఇంటింటికీ రేషన్​సరకులు అందిస్తామని ఎన్నికల హామీల్లో పెట్టారు. తీరా అమలు చేయాలంటే సవాలక్ష చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అవేంటో పరిశీలిస్తే..

ఫిబ్రవరి 1 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా 9,260 మొబైల్​వాహనాలతో రేషన్​సరకుల డోర్​డెలివరీకి సీఎం శ్రీకారం చుట్టారు. వాహనాల కోసమే దాదాపు రూ.830కోట్లు వెచ్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెంది డ్రైవింగ్​లైసెన్స్​కలిగిన యువతకు వాహనాలను అప్పగించారు. వాళ్ల నుంచి పది శాతం లబ్దిదారుని వాటాగా కట్టించారు. ఇక వాహనాలు రోడ్డెక్కిన తర్వాత సమస్యలు ప్రారంభమయ్యాయి. మూటలు మోసే పని తాము చేయలేమని వాహనదారులు మొండికేశారు. వాహనదారుడికి, హెల్పర్‌కు కలిపి ఓ ఐదు వేలు పెంచారు. అయినా సరే తమ వల్ల కాదంటూ చాలా చోట్ల చేతులెత్తేస్తున్నారు. విజయనగరం జిల్లా ఏజెన్సీలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వాహనం వచ్చే సమయానికి జనం ఇళ్ల దగ్గర ఉండడం లేదు. జనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాహనం రాదు. ఇక వేలిముద్రలు, నెట్​సౌకర్యం లేకున్నా ఆఫ్​లైన్‌లో సరకులు ఇచ్చే ఏర్పాటు చేశారు. అది అంతగా ప్రయోజనం చూపలేదు. ఏ వాహనం వద్దనైనా సరకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో రోడ్డుపై వాహనాల వద్ద క్యూ పెరుగుతోంది. ఇన్ని చేసినా వాహనదారులు తమ వల్ల కాదంటూ మొరాయిస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్క చిత్తూరు జిల్లాలో 37 మంది రాజీనామా చేశారు. ఇంకా మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

వాస్తవానికి ఓ డ్రైవర్​మైండ్​సెట్​ప్రకారం డ్రైవింగ్​తప్ప మరో పని చెయ్యలేరు. ఆ వృత్తిలో ఉన్నోళ్లు ఇంకో పని చెయ్యడానికి ఇష్టపడరు. కేవలం వాహనదారుడ్ని డ్రైవింగ్​వరకే వదిలేస్తే.. వాహనంలో మరో ఇద్దరు ఉండాలి. ఇప్పుడు ఉన్న హెల్పర్​కాకుండా మరొకర్ని నియమిస్తే అదనంగా మరో రూ. పదివేలు భారం పడుతుంది. ఈ పథకం నుంచి వెనక్కి మళ్లితే పరువుపోతుందని అదొక బాధ. ఈపాటికే రేషన్​డీలర్లు తమ నోరుగొట్టి ఈ పథకాన్ని పెట్టినట్టు వాపోతున్నారు. ఇపటిదాకా రేషన్​డీలర్లు ఆయా ప్రాంతాల్లోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను విరాళాలతో కొట్టి బియ్యం బ్లాక్​మార్కెట్, తూకాల్లో తేడాతో నెట్టుకొస్తున్నారు. అధికారులకు లంచాలూ అందులోనే. ఓరకంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ల కార్యకర్తలే రేషన్​డీలర్​షిప్పును దక్కించుకొని దందా సాగిస్తుంటారు. రేషన్​డీలర్ల ప్రధాన ఆదాయ వనరు గోనె సంచులకు ప్రభుత్వం ఎసరు పెట్టింది. గోనె సంచులు వెనక్కి ఇవ్వకుంటే రూ.40 చొప్పున లెక్కకడతామనే సరికి వాళ్లు గతుక్కుమన్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.1800 కోట్లపైనే మిగులుతుంది. ఇంటింటికీ రేషన్​సరకుల పంపిణీ సజావుగా సాగాలంటే వాహనంలో నెలకు పదివేల వేతనానికి మరొకర్ని నియమించాలి. గోనె సంచుల ద్వారా వచ్చే ఆదాయంతో ఈ ఏర్పాటు చేయొచ్చు. లేదంటే పథకాన్ని రద్దు చేసుకోవాలి. ఈ రెండూ కాకుండా ఇలాగే నడిపించాలంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాల్లో ఇదొక విఫల పథకంగా మిగిలిపోతుంది.

Advertisement

Next Story

Most Viewed