ప్రశ్నార్థకంగా యాసంగి సాగు

by Anukaran |
ప్రశ్నార్థకంగా యాసంగి సాగు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్​ పంటల సాగు ప్రశ్నార్థకంలో పడింది. వానాకాలం సీజన్​ నుంచి నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్​ యాసంగి సాగుపై ఇంకా ప్రకటన చేయలేదు. నియంత్రిత సాగు విధానంలో ప్రతి సీజన్​లో పండించే పంటల సాగుపై రాష్ట్రసర్కారు సమగ్రమైన విధానాన్ని ఖరారు చేస్తోంది. జిల్లాల వారీగా వేయాల్సిన పంటలు, వరిలో సన్న రకాలు, దొడ్డు రకాలు, ఏ ప్రాంతాల్లో సన్న రకాలు పండించాలనే వివరాలను సిద్ధం చేసి ముందుగానే జిల్లాలు అక్కడ్నుంచి గ్రామస్థాయి వరకు పంపించి రైతులకు సూచిస్తోంది. కానీ, ఈసారి యాసంగి సీజన్​ ముంచుకొస్తున్నా అడుగులు పడటం లేదు. దీంతో నియంత్రిత సాగు విధానంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. మక్కల సాగును వద్దంటే వద్దంటూ చెబుతున్న సీఎం కేసీఆర్​..ఇప్పుడు వరిలో సన్నాలు వేయాలా..దొడ్డు రకాలను పండించాలనే అంశంపై తేల్చడం లేదు. దీంతో నారుమళ్లకు వేళవుతుండటంతో సందిగ్ధత నెలకొంది.

యాసంగిలో 65 లక్షల ఎకరాలు..
యాసంగి సీజన్​లో రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు జిల్లాల వారీగా యాసంగి పంటలపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని ప్రకారం వరి పంటను 50 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు ప్రణాళికలో వెల్లడించారు. శనగ 4.50 లక్షలు, వేరుశనగ 4 లక్షలు, మిరప, ఇతర కూరగాయలు 1.50 నుంచి 2 లక్షలు, జొన్న లక్ష, నువ్వులు లక్ష, పెసర్లు 50-60 వేలు, మినుములు 50 వేలు, పొద్దు తిరుగుడు 30-40 వేలు, ఆవాలు, కుసుమలు, సజ్జలు లాంటి పంటలు మరో 60-70 వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు.

‘సన్నా’లతో సమస్యలు..
వానాకాలం సీజన్​ నుంచి నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చిన సర్కారు సన్నాల సాగును పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 34.45 లక్షల ఎకరాల్లో సన్నాలను సాగు చేశారు. దీంతో 98.61 లక్షల మెట్రిక్​ టన్నుల సన్నధాన్యం, 33.33 లక్షల మెట్రిక్​ టన్నుల దొడ్డు దాన్యం ఉత్పత్తి వస్తోంది. సన్నరకం వరి సాగులో రైతులు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. సన్నాల పంట దిగుబడి తక్కువ. దొడ్డురకం ధాన్యం ఎకరానికి ౩౦ క్వింటాళ్లు దిగుబడి వస్తే, సన్నరకం వరి పంట దిగుబడి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు వచ్చింది. ‘సన్నా’లకు తెగుళ్లు కూడా ఎక్కువ రావడంతో రూ. 7 వేల వరకు అదనపు పెట్టుబడి పెట్టారు. పంట కాలం కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలో కష్టాలు పడి సన్నాలను సాగు చేసినా కొనుగోళ్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో సన్నాల కొనుగోలుకు సమస్యలున్నాయి.

మిల్లర్ల సాకులు..
సన్నాలను కొనేందుకు మిల్లర్లు సవాలక్ష సాకులు చూపిస్తున్నారు. బస్తాకు తక్కువ వస్తుందని, బియ్యం తక్కువగా వస్తున్నాయంటూ కొనేందుకు వెనకాడుతున్నారు. కొన్నా తక్కువకు తీసుకుంటున్నారు. గతేడాది ఇదే సమయంలో తేమ శాతం 22 నుంచి 28 వరకు ఉన్నా మిల్లర్లు రూ. 2,200 వరకు ధర పెట్టారు. ఇదే సమయంలో ఒకేసారి ధాన్యం వస్తుండటంతో మిల్లర్లు ధరను తగ్గిస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర పెంచుతామని ప్రకటించినా ధర తగ్గుతూనే ఉంది. ప్రస్తుతం సన్నధాన్యం మార్కెట్​ మొత్తం మిల్లర్ల చేతుల్లోనే ఉందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పడు సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.1,650 నుంచి రూ.1,750 వరకే తీసుకుంటున్నారు.

ప్రణాళికేది..?
రాష్ట్రంలో నియంత్రిత సాగు ప్రణాళిక ఇంకా విడుదల కాలేదు. అసలు నియంత్రిత ప్రణాళిక సిద్ధం చేశారా అనేది కూడా సందేహంగానే మారింది. నియంత్రిత సాగు విధానంలో ఏ పంటలు వేయాలనే అంశం ఇంకా తేల్చడం లేదు. వరిసాగు 50 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా వేసినా..దొడ్డు రకాలు వేయాలా? సన్నాలను పండించాలా..? అనే వివరాలివ్వడం లేదు. దీనిపై జిల్లాల వారీగా కూడా ప్రకటన లేకపోవడం, వ్యవసాయ శాఖ కూడా చేతులెత్తేస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. యాసంగి సీజన్​లో నవంబర్​ 15 నుంచి డిసెంబర్​ 15 వరకు నారుమళ్లు వేసుకునేందుకు అనువైన సమయం. ఇదే సమయంలో నారుమళ్లు సిద్ధం చేసుకుంటారు. ఒకవేళ ఆలస్యమైతే నారు ఎదుగుదల సరిగా ఉండదు. నవంబర్​ చివరి వారం నుంచి చలి పెరుగుతోంది. ఈ ప్రభావం వరినారుపై ఎక్కువగా ఉంటోంది. అదే సన్న రకాలపై మరింత ప్రభావం ఉంటుంది. యాసంగి మీదకు వస్తుండటంతో ఎలాంటి రకాలను పండించాలనే స్పష్టత లేకపోవడంతో రైతుల్లో టెన్షన్​ మొదలైంది.

మిల్లర్లు చెప్పాల్సిందేనా…?
ప్రస్తుతానికి మిల్లర్ల హవా నడుస్తోంది. మార్కెట్​లో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. సన్నాలకు ఉత్పత్తి తక్కువగా ఉందంటూ ధరను తగ్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు ప్రభుత్వానిక నివేదిక ఇస్తేనే యాసంగి సాగుపై నియంత్రిత సాగు ప్రణాళిక వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. మిల్లర్ల చేతుల్లోనే ప్రభుత్వం ఉందని, మిల్లర్లు చెప్పేదాకా సాగు ప్రణాళిక రాదంటూ ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed