విజయదశమి డెడ్‌లైన్..!

by Shyam |   ( Updated:2020-09-14 00:21:00.0  )
విజయదశమి డెడ్‌లైన్..!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి పనులన్నింటినీ దసరా వరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రసర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఆదివారం యాదాద్రికి చేరుకున్నకేసీఆర్.. బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం యాదాద్రి అంతా కలియ తిరిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, చతుర్వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పనులకు సంబంధించిన వివరాలను ఈవో గీత, ఆర్కిటెక్చర్ ఆనంద‌సాయి వివరించారు.

బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత సీఎం తూర్పు ప్రాకారాలను, ఆలయ మాడ వీధులను పరిశీలించారు. ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి పూజలు చేశారు. ప్రధాన ఆలయం గోడలపై వేసిన నర్సింహస్వామి దశావతరాలకు సంబంధించిన చిత్రాలను కేసీఆర్ తిలకించారు. అనంతరం ప్రధాన గర్భాలయం లోపలికి వెళ్లి లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని ఆండాల్, ఆళ్వారుల విగ్రహాలు, విశ్వక్సేన విగ్రహాలను చూశారు.

ఆలయానికి సంబంధించిన టోటల్ వ్యూను ఆర్కిటెక్చర్ ఆనంద్‌సాయి వీడియో రూపంలో కేసీఆర్‌కు ప్రజంటేషన్ ఇచ్చారు. ఘాట్ రోడ్డులో కన్పించిన వానరాలకు సీఎం కేసీఆర్ స్వయంగా అరటి పళ్లను అందించారు. ఇదిలా ఉంటే..సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి గుట్టపైకి మీడియాను అనుమతించలేదు. దీంతో సీఎం యాదాద్రి పర్యటనకు మీడియాను అనుమతించకుండా ఉండాల్సిన అవసరం ఏంటన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, అధికారులు ఉన్నారు.

క్షేత్రాభివృద్ధి పనుల పరిశీలన..

స్వామివారి దర్శనం తర్వాత క్షేత్రాభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని సీఎంకు అధికారులు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తోన్న ఆరు వరుసల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఘాట్ రోడ్డులో మొక్కల పెంపకం పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాల అమరిక పనులను సీఎం పరిశీలించారు. దర్శన సముదాయం, ప్రసాద కాంప్లెక్స్, శివాలయం, పుష్కరిణి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయానికి నలుదిక్కులా కృష్ణశిల రాతి విగ్రహాలు, సింహం, ఐరావతం, శంకు చక్రాలు, గరుత్మంతుని విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. ఆలయం దివ్య విమాన రాజగోపురానికి స్వర్ణకాంతులు ఆలయ నగరి, వీవీఐపీ వసతి కోసం ప్రెసిడెన్షియల్ సూట్స్, విల్లాల నిర్మాణాలను పరిశీలించారు. ఈ పనులన్నింటినీ సీఎం పరిశీలించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

Advertisement

Next Story

Most Viewed