ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి షియోమీ!

by Harish |   ( Updated:2021-03-26 05:03:35.0  )
Xiaomi
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ఆదరణ ఉన్న స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సహా హువావే, ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలు ఆటోమోటివ్ పరిశ్రమలోకి ప్రవేశించగా, తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ కూడా ఈ జాబితాలో చేరింది. రాయ్‌టర్స్ నివేదిక ప్రకారం..స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షియోమీ తన సొంత బ్రాండ్ పేరుతో చైనాలో ఉన్న ఆటో తయారీ గ్రేట్‌వాల్ మోటార్ ప్లాంట్ సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయాలని భావిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా ఉన్న షియోమీ తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని(ఈవీ) 2023లో తీసుకురావాలనుకుంటోంది. తన ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల మాదిరిగానే ఈవీల ఉత్పత్తిని సైతం విస్తృతంగా నిర్వహించాలని షియోమీ లక్ష్యంగా పెట్టుకుంది.

షియోమీ ఈవీ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు గ్రేట్‌వాల్ సంస్థ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీని అందించనున్నట్టు తెలుస్తోంది. గ్రేట్‌వాల్ మోటార్ కంపెనీ గతంలో ఇతర కంపెనీలకు ఉత్పాదక సేవలను అందించినప్పటికీ, షియోమీతో భాగస్వామ్యాన్ని మరో వారంలోగా ప్రకటించనున్నట్టు నివేదిక అభిప్రాయపడింది. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టెలివిజన్ సెట్లు, వేరబుల్స్, స్కూటర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, రైస్ కుక్కర్ల వంటి ఎలక్ట్రానిక్స్, ఇంటర్నెట్ పరికరాలను తయారు చేస్తోంది. హార్డ్‌వేర్ విభాగంలో కంపెనీకి ఉన్న అనుభవం నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగవంతం చేయడానికి తోడ్పడుతుందని షియోమీ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed