వరల్డ్స్ రిమోట్ హోటల్ ‘షెల్డన్ చాలెట్’.. మూడు రాత్రులకు రూ.26 లక్షలు

by Shyam |   ( Updated:2021-11-20 05:11:21.0  )
వరల్డ్స్ రిమోట్ హోటల్ ‘షెల్డన్ చాలెట్’.. మూడు రాత్రులకు రూ.26 లక్షలు
X

దిశ, ఫీచర్స్: అలాస్కాలోని డెనాలి, రూత్ గ్లేసియర్‌పై ‘షెల్డన్ చాలెట్’ అనే హోటల్ ఉంది. ఇది పర్వత శిఖరం మీద నిర్మించిన కట్టడం మాత్రమే కాదు ప్రపంచంలోనే అత్యంత రిమోట్ ఏరియాలో ఉన్న హోటల్ కూడా. శ్వేతవర్ణంలో మెరిసిపోయే మంచు కొండల నడుమ కొలువుతీరిన ఈ హోటల్‌కు చేరుకోవాలంటే ‘హెలికాప్టర్’ తప్పనిసరి. ఎటుచూసినా మంచు మాత్రమే కనిపించే ఇక్కడ బస చేయాలని కోరుకోని వారుండరంటే అతిశయోక్తి కాదేమో!

అలాస్కాలోని డెనాలి నేషనల్ పార్క్ ఆరు మిలియన్ ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా.. అందులో గ్రిజ్లీ ఎలుగుబంట్లు, కారిబౌ, దుప్పి, తోడేళ్లతో పాటు మరెన్నో వన్యప్రాణుల ఆవాసంగా ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత అందమైన ప్రదేశాల్లో ఇది ఒకటి కాగా.. అత్యంత ఇన్-యాక్సెసబుల్ ప్రదేశం కూడా. ఉదాహరణకు, డాన్ షెల్డన్ యాంఫిథియేటర్, 6,000 అడుగుల (1,829 మీటర్లు) ఎత్తులో ఉన్న ఒక హిమనదీయ లోయ కాగా ఒకప్పుడు అక్కడికి చేరుకోవాలంటే స్కీ-ఎక్విప్డ్ ప్లేన్ ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. ప్రస్తుతం అక్కడ ఓ విలాసవంతమైన షెల్డన్ చాలెట్ హోటల్ ప్రారంభమైన నాటి నుంచి ప్రైవేట్ హెలికాప్టర్ రైడ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. రాబర్ట్, కేట్ షెల్డన్స్ ఇద్దరూ కలిసి షెల్డన్ చాలెట్ హోటల్‌ను 2018లో నిర్మించగా, దానికి తమ తండ్రి పేరు పెట్టడం విశేషం. షెల్డన్ చాలెట్‌ నిర్మాణ అనుమతులు పొందేందుకు కేట్, రాబర్ట్స్ ఒక దశాబ్దం పాటు శ్రమించారు. అంతేకాదు ఇలాంటి రిమోట్ ప్రదేశానికి అవసరమైన సామాగ్రిని తీసుకువెళ్లేందుకు కూడా అంతే శ్రమించారు. అయితే తన తల్లిదండ్రులు 60వ దశకంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం వర్ణించలేని అనుభూతి అని రాబర్ట్ చెప్పాడు.

పట్టణ జీవితాలతో విసిగిపోయిన వారితో పాటు, అడ్వెంచర్స్ ఇష్టపడే సాహసికులకు ఈ హోటల్ ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది. షెల్డన్ చాలెట్‌లో మూడు రాత్రుల బస చేసేందుకు ఒక్కో జంటకు $35,000 (ఇండియన్ కరెన్సీలో.. రూ. 26 లక్షలు) ఖర్చవుతుంది. హెలికాప్టర్ షటిల్ సర్వీస్, గౌర్మెంట్ డైనింగ్, స్లెడ్డింగ్, గ్లేసియర్ ట్రెక్కింగ్ వంటివి ప్యాకేజీలో భాగంగా అందుతాయి. ఇది ప్రతి ఒక్కరూ అనుభవించేందుకు వీలు కాకపోవచ్చు కానీ డబ్బు సమస్య కాకపోతే, ప్రపంచంలోని అత్యంత రిమోట్ చాలెట్‌లో ఉండటం కచ్చితంగా మీ బకెట్ లిస్ట్‌లో ఉండి తీరాల్సిన ప్లేస్‌గా చెప్పొచ్చు.

షెల్డన్ చాలెట్ ఏ సమయంలోనైనా గరిష్టంగా 10 మంది వ్యక్తులకు వసతి కల్పిస్తుంది. పగటిపూట మంచుతో కప్పబడిన పరిసరాలు, రాత్రిపూట మాత్రం స్పెక్టాక్యులర్ విజువల్స్‌తో విజిటర్స్‌ను ఆశ్చర్యపరుస్తాయని హోటల్ నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్న వేళల్లో రాపెల్లింగ్, గ్లేసియర్ ట్రెక్కింగ్, మాస్టోడాన్ బోన్‌యార్డ్‌ను సందర్శించడంతో పాటు ఐస్ ఫిషింగ్ కూడా చేయొచ్చు. ఇక రాత్రి సమయంలో రూఫ్‌టాప్ స్పా ఎంజాయ్ చేయడంతో పాటు స్టార్‌గేజ్ లేదా అలస్కాన్ చెఫ్ డేవ్ థోర్న్ తయారుచేసిన వంటకాలను ఆస్వాదించొచ్చు.

Advertisement

Next Story