Zelenskyy : భారత్ తలుచుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుంది : జెలెన్‌స్కీ

by Hajipasha |   ( Updated:2024-08-23 18:10:45.0  )
Zelenskyy : భారత్ తలుచుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుంది : జెలెన్‌స్కీ
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ‌తో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భేటీ అనంతరం ఓ భారతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను ప్రపంచంలో గొప్ప ప్రభావవంతమైన శక్తిగా ఆయన అభివర్ణించారు. భారత్ తలుచుకుంటే ఈ యుద్ధం చేయకుండా పుతిన్‌ను అడ్డుకోగలదని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.రష్యా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంతో పాటు పుతిన్‌‌ను నియంత్రణలోకి తెచ్చే సత్తా భారత్‌కు ఉందన్నారు. ‘‘ఈ యుద్ధం ఒకే ఒక్క వ్యక్తి కారణంగా జరుగుతోంది. అతడే పుతిన్. యావత్ ప్రపంచమంతా ఉక్రెయిన్ వెనుక ఉంది. అయినా ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

ఆత్మీయ ఆలింగనం మా కల్చర్‌లో భాగం : జైశంకర్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన వేళ ఉక్రెయిన్‌ మీడియాకు చెందిన కొందరు పాత్రికేయులు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కీలక ప్రశ్నలు సంధించారు. జులై 8,9 తేదీల్లో రష్యాలో పర్యటించిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను భారత ప్రధాని మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ ఫొటోను అప్పట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ పెట్టారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశపు నేత, ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నేరగాడిని మాస్కోలో కౌగిలించుకున్నాడు. ఇది ప్రపంచ శాంతికి విఘాతం’’ అని ఆనాడు జెలెన్‌స్కీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ అంశాన్ని తాజాగా శుక్రవారం రోజు గుర్తు చేస్తూ ఓ విలేకరి భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ప్రశ్నించారు. ‘‘ఇండియా కనీసం జెలెన్‌స్కీని సమర్ధించడం లేదు. అటు రష్యాకు కూడా మద్దతు పలకడం లేదు. అలీన విధానంతో ముందుకుపోతున్నట్లు కనిపిస్తోంది’’ అని ఆ విలేకరి పేర్కొన్నాడు. దీనికి స్పందించిన జైశంకర్.. ‘‘ప్రపంచ దేశాల నేతలు కలిసినప్పుడు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అనేది సర్వసాధారణమైన అంశం. ఇది మీ కల్చర్‌లో భాగం కాకపోవచ్చు. కానీ మా కల్చర్‌లో మాత్రం భాగమే’’ అని స్పష్టం చేశారు. గత నెలలో రష్యా పర్యటన సందర్భంగా పుతిన్‌, మోడీ ఆత్మీయ ఆలింగనంలో తప్పేం లేదన్నారు. కాగా, శుక్రవారం రోజు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జెలెన్‌స్కీని కూడా మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed