Pannun: భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ఖలిస్థానీ వేర్పాటువాది పన్నూ

by Shamantha N |   ( Updated:2024-10-25 05:57:14.0  )
Pannun: భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేసిన  ఖలిస్థానీ వేర్పాటువాది పన్నూ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థాని వేర్పాటువాది గురపత్వంత్ సింగ్ పన్నూ భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. ఇటీవలే విమానాలు పేల్చేస్తానన్న పన్నూ.. ఇప్పుడేమో సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయాలని బెదిరించాడు. భారత్‌లోని సీఆర్పీఎఫ్‌ పాఠశాలలను మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విదేశీ పర్యటనల గురించి సమాచారం ఇచ్చినవారికి మిలియన్ డాలర్లు రివార్డుగా ఇస్తానని పేర్కొన్నాడు. దీనిపై అమెరికాలో ఉన్న పన్నూ ఒక ప్రకటనను విడుదల చేశాడు. ‘‘భారత సీఆర్పీఎఫ్‌కు హోం మంత్రి అమిత్‌షా నాయకత్వం వహిస్తున్నారు. హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ఆయనే కుట్ర పన్నారు. కిరాయి హంతకులను ఆయనే నియమించారు. న్యూయార్క్‌లో నా హత్యకు సైతం కుట్ర పన్నారు’’ అని ఆరోపణలు చేశాడు. సీఆర్పీఎఫ్‌ మాజీ అధికారి, పంజాబ్‌ మాజీ డీజీపీ కేపీఎస్‌ గిల్‌, మాజీ రా అధికారి వికాస్‌ యాదవ్‌లపై విరుచుకుపడ్డాడు. వారు తమ హక్కులనే కాలరాశారని ఫైర్ అయ్యారు. పంజాబ్‌ సహా విదేశాల్లోని సిక్కులపై దాడులు చేశారన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సీఆర్పీఎఫ్‌ పాఠశాలలను బహిష్కరించాలన్నారు. స్వర్ణ దేవాలయంపై దాడి, 1984 సిక్కుల ఊచకోత వంటివి సీఆర్పీఎఫ్ చేసిందని ఆరోపించాడు.

సీఆర్పీఎఫ్ పాఠశాలలపై దాడులు

ఇటీవలే, ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్‌ విహార్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ పాఠశాల వద్ద పేలుడు జరిగింది. ‘జస్టిస్‌ లీగ్‌ ఇండియా’ అనే ఖలిస్థానీ సంబంధిత గ్రూపు పేలుడుకు బాధ్యతను తీసుకొంది. ఖలిస్థానీ వేర్పాటువాదుల హత్యకు ప్రతీకారంగానే పేలుడు చేపట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు క్లిప్ తో పాటు టెలిగ్రామ్ లో వీడియో వైరల్ గా మారింది. “భారత నిఘా ఏజెన్సీలు మమ్మల్ని అణచివేయలేదు. ఏ క్షణమైనా దాడి చేయగల సత్తా మా దగ్గర ఉంది. ఖలిస్థాన్ జిందాబాద్” అనే మెసేజ్ ని టెలిగ్రామ్ లో పోస్టు చేశారు. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రెండు కేసులను ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed