రష్యా చమురు కొనుగోలుకు కారణమిదే: జైశంకర్ ఆసక్తికర సమాధానం

by samatah |
రష్యా చమురు కొనుగోలుకు కారణమిదే: జైశంకర్ ఆసక్తికర సమాధానం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-రష్యా సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్ కాన్ఫరెన్సులో భాగంగా యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్‌తో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూనే అమెరికాతో పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను భారత్ ఎలా సాగిస్తోంది అనే ప్రశ్నకు జైశంకర్ బదులిచ్చారు. ‘ఇది సమస్య కానేకాదు. దీని వల్ల ఇరుదేశాలకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఈ విషయంలో భారత్‌ను ప్రశంసించాలి’ అని చెప్పారు. రెండు దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగించే సత్తా భారత్‌కు ఉందన్నారు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై స్పందిస్తూ..‘మేమము చాలా తెలివైన వాళ్లం. సరైన ఆప్షన్ ఎంచుకునే అవకాశం భారత్‌కు ఉంది. విదేశాంగ విధానంలో రాజీ పడే ప్రసక్తే లేదు’ అని సమాధాన మిచ్చారు. భారత్ వ్యక్తులతో మమేకమవుతుందని అనేక విషయాలను పంచుకుంటామని తెలిపారు.

అధిక చమురు దిగుమతి అక్కడి నుంచే

2022 ఫిబ్రవరి 22లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. కానీ భారత్ మాత్రం తక్కువ ధరకే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నది. దీంతో భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసే దేశంగా రష్యా అవతరించింది. ఎస్ అండ్ పీ గ్లోబల్ కమోడిటీ ఇన్‌సైట్స్ ప్రకారం.. భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో 35 శాతానికి పైగా రష్యా సరఫరా చేసింది. కాగా, రష్యా చమురును చౌకగా కొనుగోలు చేయాలన్న భారత్ వైఖరిని జైశంకర్ వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే అనేక సార్లు భారత వైఖరిని స్పష్టంగా చెప్పారు.

Advertisement

Next Story