యుద్ధంలో ఎప్పుడూ పరిష్కారం దొరకదు: రష్యా ఉక్రెయిన్ వార్‌పై జైశంకర్

by samatah |
యుద్ధంలో ఎప్పుడూ పరిష్కారం దొరకదు: రష్యా ఉక్రెయిన్ వార్‌పై జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: యుద్ధ భూమిలో ఎన్నడూ సమస్యలకు పరిష్కారం దొరకదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో ఉన్న ఆయన కౌలాలంపూర్‌లో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి ఏంటి? అని అడిగిన ఓ ప్రశ్నకు జైశంకర్ బదులిచ్చారు. యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలని భారత్ కోరుకుంటున్నట్టు తెలిపారు. దీనికి పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. యుద్ధంలో విజేతలు ఎవరూ ఉంబోదని చెప్పారు. ఎంతో మంది అమాయక ప్రజలు యుద్ధంలో ప్రభావితమవుతారని వెల్లడించారు. చర్చల ద్వారానే పరిష్కారం వెతుక్కోవాలని సూచించారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనా స్పందించిన జైశంకర్ గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిని ఉగ్రదాడిగా అభివర్ణించారు. అమాయక పౌరుల మరణాలను ఎవరూ సహించబోరని తేల్చిచెప్పారు. ఏ దేశమైనా అంతర్జాతీయంగా మానవతా చట్టాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఈ సంఘర్షణపై భారత్ సూత్రప్రాయమైన వైఖరిని కలిగి ఉందని తెలిపారు. భారత్-మలేషియాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇరు దేశాల వ్యాపార పరస్పర చర్యల్లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. కాగా, జైశంకర్ సింగపూర్, ఫిలిప్పీన్స్, మలేషియాలలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story