China | చైనాలో పెరిగిన నిరుద్యోగం.. "యువత పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్లాలి"

by srinivas |   ( Updated:2023-05-02 10:43:43.0  )
China | చైనాలో పెరిగిన నిరుద్యోగం.. యువత పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్లాలి
X

దిశ వెబ్ డెస్క్ : ప్రపంచంలో నిరుద్యోగ (Unemployment) సమస్య నానాటికీ పెరిపోతోంది. ఇతర దేశాలకు అత్యధికంగా ఎగుమతులు చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్న చైనా (China) దేశంలో కూడా ఈ సమస్య అధికంగానే ఉంది.

డ్రాగన్ దేశంలోని బడా కంపెనీల్లో వరుస లేఆఫ్స్‭తో యువత పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో సైతం మరింత తీవ్ర స్థాయికి పెరగనుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది. దీంతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు చైనాలోని ఒక ప్రావిన్స్ ప్రభుత్వం యువతకు సరికొత్త సలహా ఇచ్చింది. పట్టణాల్లో ఉద్యోగాల సృష్టి జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో గ్రామాలకు వెళ్లి, ఉద్యోగాలు వెతుక్కోవాలని సలహా ఇచ్చింది.

చైనాలోని గ్వాంగ్‌డోంగ్ ప్రావిన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా పేరు పొందింది. ఇది హాంగ్ కాంగ్‌కు పక్కనే ఉంటుంది. అయితే ఇక్కడ నిరుద్యోగం పెరగడంతో ఎక్కడ చూసినా ‘నో వేకెన్సీ’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కాలేజ్ గ్రాడ్యుయేట్ల కోసం గ్రామాల్లోనే ఉపాధి కల్పన పథకాలు తీసుకొస్తామని గ్వాంగ్‌డోంగ్ ప్రావిన్స్ ప్రభుత్వం తెలిపింది. కాలేజ్ నుంచి కొత్తగా పాసైన యువత రెండు నుంచి మూడు సంవత్సరాలు గ్రామాలలోనే పని చేయాలని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సుమారు 3 లక్షల మంది నిరుద్యోగ యువతను పల్లెటూళ్లకు పంపించింది కూడా.




గతేడాది చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైతం ఇదే సలహా ఇచ్చారు. 2022 డిసెంబరులో ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం కోసం యువత గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. మావో జెడాంగ్ పరిపాలనా కాలంలో కూడా చైనా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేసింది. అప్పట్లో కూడా యువత మారుమూల గ్రామాలకు వెళ్లిపోయారు. చైనాలో ఈ ఏడాది కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పుచ్చుకుని బయటకు వచ్చినవారి సంఖ్య కోటి 15 లక్షలకు పైగానే ఉంటుందట. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండటంతో సాంఘిక అస్థిరత్వానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోందనే ఆందోళనలు పెరిగాయి.

చైనాలోని పట్టణ ప్రాంతాల్లో 16 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కుల్లో నిరుద్యోగం రేటు ఈ ఏడాది మార్చిలో 19.6 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి నెలలో ఈ రేటు 18.1 శాతం ఉండేది. చైనాలోని పట్టణాలు, నగరాల్లో కోటికి పైగా నిరుద్యోగ యువత ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇక చైనాలో నిరుద్యోగం రేటు పెరుగుతుండటానికి కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనమేనని నిపుణులు చెప్తున్నారు. మాన్యుఫ్యాక్చరింగ్ మందగించడం, ఐటీ సెక్టర్ బలహీనపడటం ఈ సమస్యకు కారణాలని చెప్తున్నారు. వైట్ కాలర్ ఉద్యోగాలు కోరుకునే వారందరికీ కమ్యూనిస్ట్ యూత్ లీగ్ గత నెలలో హెచ్చరించింది. ఫ్యాక్టరీలలో స్క్రూలను బిగించడానికి నిరాకరించేవారిపై మండిపడింది. సూట్లు విప్పేసి, చొక్కా చేతులు వెనుకకు మడిచి, పొలం పనులకు వెళ్లాలని చెప్పింది.

అయితే దీనిపై చైనా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. సామాజిక మాధ్యమాలపై చైనా ప్రభుత్వం గట్టి ఆంక్షలు విధిస్తున్నప్పటికీ, చాలా మంది ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. విద్యావంతులు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం తగిన సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించలేకపోతోందని మండిపడుతున్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో కోట్ల మంది నిరుద్యోగులుగా ఉండడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed