పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై డ్రోన్లతో దాడి

by Disha Web Desk 17 |
పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై డ్రోన్లతో దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల ఇరాన్‌, ఇజ్రాయిల్‌పైకి 300కి పైగా డ్రోన్లు, క్షిపణిలతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని ఇస్ఫాహాన్ ప్రావిన్స్‌కు వాయువ్యంగా ఉన్న షెకారీ ఆర్మీ ఎయిర్‌బేస్ సమీపంలో పేలుళ్లు సంభవించాయి, దీంతో వెంటనే అప్రమత్తమైన ఇరాన్ తన గగనతల రక్షణ వ్యవస్థను అలర్ట్ చేసింది. సెంట్రల్ సిటీ ఇస్ఫహాన్‌పై మూడు డ్రోన్‌లను కూల్చివేసినట్లు అక్కడి మీడియా తెలిపింది. అనేక డ్రోన్‌లను కూల్చివేశామని, ప్రస్తుతానికి ఎలాంటి క్షిపణి దాడి జరగలేదని ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రతినిధి హొస్సేన్ దాలిరియన్ తెలిపారు.

ప్రస్తుతం ఇస్ఫహాన్‌తో పాటు ఇరాన్‌లోని టెహ్రాన్, షిరాజ్ నగరాలు, ఇరాన్ పశ్చిమ సరిహద్దుల్లోని విమానాశ్రయాలలో విమానాలను నిలిపివేసినట్లు మెహర్ వార్తా సంస్థ నివేదించింది. అయితే ఈ డ్రోన్ల దాడిని ఇజ్రాయిల్ చేసి ఉంటుందని అమెరికా పేర్కొంటుంది. దీనిపై ఇజ్రాయిల్ సైనికాధికారులు ‘ప్రస్తుతానికి ఏం మాట్లాడలేం’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్ వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ఇస్ఫహాన్‌ ఒక పెద్ద వైమానిక స్థావరం, అక్కడ చాలా అణు కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది.

దాడి నేపథ్యంలో ఇరాన్‌కు వెళ్లాల్సిన చాలా విమానాలను దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. రోమ్ నుండి టెహ్రాన్‌కు బయలుదేరిన ఇరాన్ ఎయిర్ విమానం టర్కీలోని అంకారాకు మళ్లించారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ విమాన మార్గాలలో మార్పులు చేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇరాన్‌, ఇజ్రాయిల్‌పైకి డ్రోన్లు, క్షిపణిలతో దాడి చేసిన నేపథ్యంలో దీనికి కచ్చితంగా ప్రతీకార దాడి ఉంటుందని 24-48 గంటల వ్యవధిలో అది జరుగుతుందని ఇజ్రాయిల్, అమెరికాకు చెప్పినట్లు సమాచారం. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత పెరుగుతుంది. అమెరికా, భారత్, రష్యా, చైనాతో సహా ప్రపంచ దేశాలు ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని రెండు దేశాలను కోరుతున్నాయి. ఈ పరిస్థితులు మరింత తీవ్రతరం అయితే ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టం సంభవిస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed