పాకిస్తాన్‌లో పెరుగుతున్న అనుమానాస్పద మరణాలు

by Harish |   ( Updated:2024-06-26 12:36:17.0  )
పాకిస్తాన్‌లో పెరుగుతున్న అనుమానాస్పద మరణాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లో ఇటీవల కాలంలో అనుమానస్పద మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కరాచీలోని వివిధ ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య ప్రస్తుతం 22కు చేరుకోవడం గమనార్హం. ఇప్పటికే చాలా మంది వివిధ కారణాలతో రోడ్లు, చెట్ల క్రింద తమ ప్రాణాలు కోల్పోగా వారి సంబంధికులు మృతదేహాలను తీసుకెళ్ళినప్పటికి ఇంకా 22 గుర్తు తెలియని మృతదేహాలు అలాగే ఉన్నాయి. పాకిస్తాన్ లాభాపేక్షలేని సంక్షేమ సంస్థ వాలంటీర్లు ఆ మృతదేహాల తాలూకు బంధువుల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించినప్పటికీ వారు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

చిపా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి, ఒక ప్రకటనలో మాట్లాడుతూ, కరాచీలోని వివిధ ప్రాంతాల్లో వాలంటీర్లు మరో ఐదు మృతదేహాలను కనుగొన్నారు, వారిలో ముగ్గురు మాదకద్రవ్యాలకు బానిసలుగా కనిపిస్తున్నారు, అయితే, ఇప్పటివరకు ఒక్క మృతదేహాన్ని కూడా గుర్తించలేదని తెలిపారు. మరణించిన వ్యక్తుల బంధువులు ఎవరూ వాటిని తీసుకెళ్లడానికి రాకపోవడంతో గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు.

ఈ మరణాలకు కారణాలు ఏమిటి..?

ప్రస్తుతం కరాచీలో వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో నగరంలోని చాలా మంది హీట్‌స్ట్రోక్‌కు గురవుతున్నారు. ఎండల వేడికి తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారిలో కొంత మంది అకస్మాత్తుగా వేడి గాలుల ఎఫెక్ట్‌తో రోడ్లు, చెట్ల క్రింద కూర్చుని అలాగే చనిపోతున్నారు. దీంతో వారు ఎవరనేది తెలుసుకోవడం కష్టంగా మారింది.

మరోవైపు నగరంలో డ్రగ్స్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది వాటికి బానిసలుగా మారారు. కరాచీలోని ఈధి ఫౌండేషన్‌కు చెందిన అధికారి అజీమ్ ఖాన్ మాట్లాడుతూ, చనిపోయిన వారిలో ఎక్కువ మంది డ్రగ్స్ బానిసలు ఉన్నారని, వారు డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు తీవ్రమైన వేడికి తట్టుకోలేక చనిపోయారని తెలిపారు. యువత బహిరంగంగానే డ్రగ్స్ వాడుతున్నారని ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి నగరంలో చాలా చోట్ల ఉందని చెప్పారు. తక్కువ ధరకు ఐస్ రూపంలో మాదకద్రవ్యాలు లభించడం వలన యువతతో పాటు, ఇతర వయస్సుల వారు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారని అధికారి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed