ఏనుగుల సినిమాకు ఎలా ఆస్కార్ అవార్డు వచ్చిందో.. Can You Say ?

by S Gopi |   ( Updated:2023-03-16 09:35:20.0  )
ఏనుగుల సినిమాకు ఎలా ఆస్కార్ అవార్డు వచ్చిందో.. Can You Say ?
X

దిశ, వెబ్ డెస్క్: మన దేశ ప్రతిష్ట మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. కారణం ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్, ది ఎలిఫెంట్ విస్పెరర్స్. అందులో ముఖ్యంగా ఇండియన్ డాక్యుమెంటరీకి ఆస్కార్ రావడం ఇదే తొలిసారి. దీంతో ది ఎలిఫెంట్ విస్పెరర్స్ పై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. ఆ డాక్యుమెంటరీలో ఏముంది.. దానిని ఎంత బాగా రూపొందించారుతోపాటు మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.


డాక్యుమెంటరీలు, సినిమాలను తీయడంతో పోటీ పెడితే ఖచ్చితంగా డాక్యుమెంటరీలు తీయడం చాలా కష్టం అంటారు సినిమా మేకర్స్. ఎందుకంటే డాక్యుమెంటరీలకు కథ రెడీగా ఉండదు. కథ ఇలా ఉండాలి.. నటీనటులు ఇలా ఉండాలని చెప్పి చేయించరు. నిజంగా జరుగుతున్న వాటిని ఉన్నది ఉన్నట్లు.. రియల్ ఎమోషన్స్ ను, రియల్ క్యారెక్టర్స్ ను, రియల్ కథను రికార్డ్ చేస్తారు. అట్లా రికార్డ్ చేసినవే డాక్యుమెంటరీ రూపంలో బయటకు తీసుకొస్తారు. అయితే, సినిమాకు మాత్రం అలా కాదు. ఏ సినిమాకు అయినా కథ రెడీగా ఉంటుంది. నటీనటులు ఉంటారు... ఇలా అనుకున్న విధంగా తీసి అందంగా, ఎమోషనల్ గా, అనుకున్న విధంగా చూపించేది సినిమా. అయితే, డాక్యుమెంటరీలు రూపొందించడానికి చాలా సమయం పడుతుంది. చాలా ఎఫెర్ట్ పెట్టాలి. అయినా కూడా ఆదాయం అంతగా ఉండదు. అందుకే డాక్యుమెంటరీస్ రూపొందించే ఫిల్మ్ మేకర్స్ చాలా తక్కువగా ఉంటారు.


అయితే, ది ఎలిఫెంట్ విస్పెరర్స్ డాక్యుమెంటరీ విషయానికి వెళ్తే.. 2015వ సంవత్సరంలో తమిళనాడులో ఉన్న నీలగిరి అడవుల్లో ఉండే ఓ తల్లి ఏనుగు కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. అయితే, ఆ సమయంలో దాని బిడ్డ అయినటువంటి ఓ గున్న ఏనుగు తల్లి లేకపోవడంతో ఒంటరైపోయింది. ఈ క్రమంలో దానికి ఏంచేయాలో అర్థంకాక అడవింతా తిరిగింది. అప్పుడు అక్కడికి కొన్ని ఆవులు వచ్చాయి. వాటితో కలిసి బతకడానికి కొన్నాళ్లపాటు అది తీవ్రంగా ప్రయత్నం చేసింది. చివరకు అది గడ్డి కూడా తినే ప్రయత్నం చేసింది. కానీ, అది హ్యాపీగా ఫీలవ్వలేదు. దీంతో అది దగ్గరలో ఉండే ఊళ్ల మీద పడి అక్కడ పండ్లు దొంగిలించడం.. వాటిని తినేది.. ఇలా కొద్ది రోజులు గడిచిపోయింది. ఇదే క్రమంలో అక్కడ ఉండే స్థానికులు దాని మీద దాడి చేశారు. కుక్కలు కూడా వెంబడించి చాలా తీవ్రంగా కరిచాయి. దీంతో ఆ ఏనుగు తీవ్ర గాయాలపాలైంది. అట్లా చావు బ్రతుకుల్లో ఉన్న ఏనుగుని అటవీశాఖ అధికారులు కాపాడి మధుమలై ఎలిఫెంట్ క్యాంప్ కు తీసుకెళ్లారు. ఇంకా ఇది బ్రతకదు అని అందరూ అనుకున్నారు. ఇలా అందరూ చేతులెత్తేసినప్పుడు బొమ్మన్ అనే ఒక గిరిజనుడు ముందుకొచ్చాడు. అయితే, అతను అక్కడున్న ఏనుగులను కడగడం, వాటికి ఆహారం పెట్టడం లాంటి పనులు చేస్తూ ఉండేవాడు. అయితే, ఆ గున్న ఏనుగును తానే కాపాడుతానని అంటూ ముందుకు వచ్చాడు. అక్కడే పని చేసే బెల్లి అనే గిరిజన మహిళ కూడా ఈ గున్న ఏనుగును కాపాడేందుకు బొమ్మన్ కు సహాయంగా ముందుకొచ్చింది.


వాళ్లిద్దరూ కలిసి గాయపడ్డ ఆ గున్న ఏనుగును కన్న బిడ్డలాగా చూసుకుంటూ కోలుకునేలాగా చేశారు. ఆ గున్న ఏనుగుకు ముద్దుగా రఘు అని పేరు పెట్టారు. అది కోలుకున్న తర్వాత ఆ గున్న ఏనుగుకు ఇతర ఏనుగుల మధ్య అనురాగం పెరిగింది. ఈ క్రమంలో బొమ్మన్, బెల్లి మధ్య కూడా అనురాగం పెరిగింది. కొన్నాళ్లకు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుని దంపతులయ్యారు. అయితే, ఏనుగులతో అనుబంధం వాళ్లు దంపతులు అయ్యేలాగా చేసింది. రఘును కొడుకులాగే చూసుకున్న ఆ గిరిజన దంపతుల దగ్గరికి రఘు లాగే తల్లికి దూరమైన ఇంకొక అనాథ గున్న ఏనుగు వచ్చి చేరింది. దాన్ని కూడా అటవీ అధికారులు సంరక్షణ కోసం వీళ్ల దగ్గరకు తీసుకువచ్చారు. అది ఆడ ఏనుగు పిల్ల. దానికి ఈ దంపతులు అమ్ము అని పేరు పెట్టారు. అప్పుడు వీళ్లది ఒక అమ్మ-నాన్న.. ఇద్దరు పిల్లలున్న కుటుంబంలాగా మారిపోయింది. అయితే, వీళ్లుండే అడవి చాలా అందమైంది. అక్కడ జలపాతాలు ఉంటాయి. ఆ జలపాతాల్లో ఆ ఏనుగులకు రోజూ వీళ్లు స్నానం చేయించి, ఆడిస్తూ అడివంతా కబుర్లు చెబుతూ తిప్పేవాళ్లు. ఇలా వాళ్ల బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమ అనురాగాలను ఉన్నది ఉన్నట్లు చూపించారు ఈ డాక్యుమెంటరి షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పెరర్స్ లో. ఈ మూవీకి కార్తికి గుంజాల్ వేస్ దర్శకత్వం వహించారు. గునీత్ మోంగా ఈ మూవీకి నిర్మాతగా పని చేశారు.


అయితే, ఈ డాక్యుమెంటరీని తీయడానికి మొత్తం సమయం ఐదేళ్లు పట్టిందంటా. 450 గంటలపాటు ఫుటేజీని రికార్డు చేశారంటా. ఈ ఫుటేజీని సినిమాకు వాడుకుంటే గనుక మొత్తం సుమారుగా 150 సినిమాలు తీయొచ్చంటా. 2022లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎంతోమందిని ఆకట్టుకుంది. అంతకంటే ముఖ్యంగా ప్రమాదంలో ఉన్న ఏనుగులను కాపాడుకోవాల్సిన బాధ్యతను, అవసరం గురించి చాలా పాజిటివ్ గా ఈ డాక్యుమెంటరీలో తెలియజేశారు. ప్రతి ప్రేమ్ లో తమిళనాడులోని నీలగిరి అందాలు కనువిందు చేసేలా తీశారు. ఇంత బాగా డాక్యుమెంటరీ రావడానికి కారణం డైరెక్టర్ కీర్తికి గుంజాల్ వేస్ నేచురల్ హిస్ట్రీస్ సోషల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కావడం, స్వయంగా ఫొటో గ్రాఫర్ కూడా కావడం. ఈమె అంతరించిపోతున్న జీవజాతులు, గిరిజనుల జీవితాలను విభిన్న కల్చర్స్ ను ఆమె డాక్యుమెంటరీస్ రూపంలో, ఫొటోస్ రూపంలో తీసుకొస్తూ ఉంటారు.


ప్రస్తుతం ఇండియా మొత్తంలో 30 నుంచి 40 వేల మధ్య మాత్రమే ఏనుగులు ఉన్నాయని గుర్తించి, ఆమె ఆవేదనకు గురైంది. అందుకే ఈ ఏనుగులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అనుకుంది. ఈ క్రమంలో తన కంట పడ్డ గున్న ఏనుగులు, బొమ్మన్, బెల్లిల స్టోరీలను ఓ పాజిటివ్ స్టోరీగా తీయాలని అనుకుంది. దానిని అనుకున్న విధంగా తీసి సొసైటీకి మెసజ్ ఇవ్వడమే కాకుండా ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీకి ప్రొడ్యూసర్ గా పని చేసిన గునీత్ కు కూడా ఇది రెండో ఆస్కార్. 2019లో ఆమె భాగస్వామిగా ఉన్న పీరియడ్ ఎండ్ అండ్ ఆఫ్ సెంటెన్స్ అనే డాక్యుమెంటరీకి కూడా బెస్ట్ షార్ట్ ఫిల్మ్ సబ్జెక్ట్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ వచ్చింది. అయితే, పూర్తి స్థాయిలో భారతీయ నిర్మాతగా అవార్డు తీసుకోడం మాత్రం ఆమెకు ఇదో తొలిసారి. అయితే, ఓ మంచి సబ్జెక్టుతో డాక్యుమెంటరీని రూపొందిస్తే ఏ స్థాయిలో గుర్తింపు పొందొచ్చో అనేది ఈ మహిళలిద్దరూ ప్రూవ్ చేసి చూపించారు.అయితే, ఈ మూవీకి వచ్చిన నేమ్, ఫేమ్, అవార్డులతో బొమ్మన్, బెల్లి, వారి పిల్ల ఏనుగుల జీవితాలను తెలుసుకోవాలనుకుంటున్నారు చాలామంది. కానీ, బొమ్మన్, బెల్లి వద్ద ఇప్పుడు ఆ పిల్ల ఏనుగులు లేవు. ఎందుకంటే వాటిని అధికారులు వేరే చోటకు తీసుకెళ్లారు. అయితే, బొమ్మన్ వద్దకు ఇప్పుడు కృష్ణ అనే పిల్ల ఏనుగు వచ్చింది. ఇప్పుడు బొమ్మన్ కృష్ణ బాగోగులు చూసుకుంటున్నాడు. అయితే, వీళ్ల కథను ప్రపమంచమంతా కూడా ఆదరిస్తున్నా కూడా వాళ్లు ఇప్పటికీ ఏనుగుల సంరక్షకులుగానే ఉంటున్నారు. ఆస్కార్ అవార్డ్ వచ్చిందని తెలిసి చాలా సంతోషపడ్డాం కానీ, మా రఘు, అమ్ము దగ్గర లేరు అన్న బాధ తమలో ఉందంటూ వారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ రెండు ఏనుగులు దూరమైనప్పుడు తమ కుటుంబం ముక్కలైనట్లు బాధపడామని బొమ్మన్ చెప్పారు.


మనిషి రోజురోజుకు అడవులను ఆక్రమించుకుంటూ వన్యప్రాణులకు అడవుల్లో చోటే లేకుండా చేస్తున్న సమయంలో ప్రకృతిలో మనిషి, మూగజీవాలు ఎలా హాయిగా జీవించవచ్చు అనే విషయాన్ని చెప్పే అందమైన డాక్యుమెంటరీనే ది ఎలిఫెంట్ విస్పరర్స్. ఈ డాక్యుమెంటరీతోనైనా ఏనుగులపై పెద్ద ఎత్తున చర్చ జరిగి వాటిని కాపాడేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టేందుకు అంతా ముందుకురావాలని మనం కోరుకుందాం.



Advertisement

Next Story

Most Viewed