మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసిన రష్యా అధ్యక్షుడు.... ఈసారి ఏమన్నాడంటే...?

by S Gopi |   ( Updated:2023-02-21 10:49:14.0  )
మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసిన రష్యా అధ్యక్షుడు.... ఈసారి ఏమన్నాడంటే...?
X

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డొన్బాస్ ను రక్షించుకునేందుకే ఏడాది కాలంగా ఉక్రెయిన్ పై ప్రత్యేక మిలిటరీ అపరేషన్ చేపట్టామని అన్నారు. అయితే పశ్చిమ దేశాలు డర్టీ గేమ్ ఆడుతున్నాయని విమర్శించారు. అయితే తాము డొన్బాస్ సమస్యలను శాంతియుతంగానే పరిష్కరించేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నామని చెప్పారు. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటన తర్వాత రష్యా పార్లమెంటులో ఆయన మాట్లాడారు. డాన్‌బాస్‌లో ఏమి జరుగుతుందో మొత్తం అబద్ధాలతో పశ్చిమ దేశాలు తమ సొంత ప్రజలను మోసం చేశాయని ఆయన అన్నారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ పై పట్టు కోసం తమతో తగదా సృష్టించాయని విమర్శించారు.

పాశ్చాత్య దేశాలు తమ ప్రజలను మోసం చేశాయని.. 2022లో రష్యా సైనిక చర్యకు ముందు ఆయుధాల సరఫరా కోసం ఉక్రెయిన్ పశ్చిమ దేశాలతో చర్చలు జరిపిందని పుతిన్ ఆరోపించారు. నాగరిక దేశాలు, మిగిలిన దేశాల మధ్య విభజన ఉండకూడదనే తమ వైఖరిని సమర్థించుకుంటున్నామని చెప్పారు. అపూర్వమైన ఆంక్షల ప్యాకేజీ ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పశ్చిమ దేశాల ప్రయత్నాలను రష్యా ఖండించిందన్నారు. పశ్చిమ దేశాలకు ట్రిలియన్ల డాలర్లు ప్రమాదంలో ఉన్నాయని, అయితే రష్యా ఆదాయ ప్రవాహాలకు ప్రమాదమేమి లేదని తెలిపారు. స్థానిక ఘర్షణను ప్రపంచ ఘర్షణగా మార్చేందుకు పశ్చిమదేశాలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉక్రెయిన్ లో ప్రత్యేక అపరేషన్ కు పూర్తి బాధ్యత పశ్చిమ దేశాలదేనని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ లో బైడెన్ పర్యటన పూర్తి భద్రత హామీతోనే సాగిందని రష్యా భద్రతా మండలి అధికారి దిమిత్రి మెద్వదెవ్ చెప్పారు. బైడెన్ ముందుస్తుగానే భద్రతా హామీలను పొంది కీవ్‌కు వెళ్లాడన్నారు. ఆయుధ పంపిణీకి కీలక హామీలు ఇచ్చాడని తెలిపారు.

Also Read: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి పాశ్చాత్య దేశాలే కారణం: వ్లాదిమిర్ పుతిన్

Advertisement

Next Story