ఇజ్రాయెల్‌లో ఆగని మారణకాండ..

by Vinod kumar |
ఇజ్రాయెల్‌లో ఆగని మారణకాండ..
X

గాజా: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధకాండలో సంభవించిన మరణాల సంఖ్య 1300 దాటింది. ఇజ్రాయెల్‌లో 800 మంది మరణించగా, ఉగ్ర సంస్థ హమాస్ పాలించే గాజా ప్రాంతంలో 560 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలో 2,750 మందికి, ఇజ్రాయెల్‌లో 2,243 మందికి గాయాలయ్యాయి. ఇక గాజా సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ పట్టణంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి శనివారం ఉదయం విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ టౌన్ లో మ్యూజిక్ పార్టీపై జరిపిన కాల్పుల్లో 260 మంది ఇజ్రాయెలీలు చనిపోయినట్లు అధికార వర్గాలు ఆలస్యంగా వెల్లడించాయి. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం కూడా గాజా ప్రాంతంపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ ఆర్మీ విరుచుకుపడింది. హమాస్ ను కట్టడిచేసే చర్యల్లో భాగంగా పూర్తిస్థాయిలో గాజా ముట్టడికి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఆదేశాలు జారీ చేశారు.

గాజాకు విద్యుత్ సరఫరా చేసే సబ్ స్టేషన్లు, జల ప్రాజెక్టులు, వంటగ్యాస్ పంపిణీ స్టేషన్లు, నిత్యావసర సరుకుల గోదాములు అన్నీ ఇజ్రాయెల్ భూభాగంలోనే ఉన్నాయి. దాదాపు 20 లక్షల మంది నివసించే గాజా ప్రాంతానికి కరెంటు, ఆహారం, ఇంధనం, నీరు అందకుండా చేస్తామని యోవ్ గాలంట్ వెల్లడించారు. గాజా చుట్టూ 3 లక్షలకుపైగా బలగాలను మోహరించామని చెప్పారు. ఈనేపథ్యంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) అత్యవసర సమావేశానికి ఇరాన్ పిలుపునిచ్చింది. ‘‘పాలస్తీనా సమస్య.. యావత్ ఇస్లామిక్ ప్రపంచం సమస్య. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై అత్యవసర చర్చలు అవసరం’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నాజర్ కనానీ ప్రకటించారు.

యుద్ధ రంగంలోకి యుద్ధ నౌకలతో అమెరికా..

ఇక హమాస్ రాకెట్ దాడుల్లో తొమ్మిది మంది అమెరికా పౌరులు మరణించారు. కిడ్నాపైన వారిలోనూ అమెరికన్లు ఉన్నారు. ఈనేపథ్యంలో అమెరికా కూడా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా రంగంలోకి దూకింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగబోతున్నాయి. ఈ లిస్టులో విమాన వాహక యుద్ధ నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ కూడా ఉంది. ఇప్పటికే దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఒకట్రెండు రోజుల్లోగా ఇజ్రాయెల్‌కు చేరుకుంటాయని నెతన్యాహుకు బైడెన్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed