'దేశం విడిచి వెళ్లిపోండి'.. అఫ్గాన్ శరణార్థులకు పాక్ ఆదేశాలు

by Vinod kumar |
దేశం విడిచి వెళ్లిపోండి.. అఫ్గాన్ శరణార్థులకు పాక్ ఆదేశాలు
X

ఇస్లామాబాద్ : ఆహార, ఆర్థిక, ఇంధన సంక్షోభాలతో సతమతం అవుతున్న పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా దేశంలో నివసిస్తున్న దాదాపు 17 లక్షల మంది అఫ్గానిస్థాన్‌ శరణార్ధులు నవంబరు 1లోగా పాక్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే భద్రతా బలగాల సహాయంతో వారిని గుర్తించి.. బలవంతంగా తరిమేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నవంబర్‌ తర్వాత పాస్‌పోర్టు లేదా వీసా లేకుండా దేశంలోకి ఎవరినీ అనుమతించమని తేల్చి చెప్పింది. పాకిస్థాన్‌ పౌరులు కాకున్నా.. ఐడీ కార్డులు ఉన్నవారి జాతీయతను గుర్తించేందుకు అవసరమైతే డీఎన్‌ఏ టెస్టులు చేస్తామని పాక్‌ హోంశాఖ మంత్రి సర్ఫరాజ్‌ బుగ్తీ స్పష్టం చేశారు.

ఇప్పటికే వందల మంది అఫ్గానిస్థాన్‌ శరణార్ధులను పాక్ సర్కారు అదుపులోకి తీసుకుందని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం ఆరోపించింది. 2021లో అఫ్గానిస్థాన్‌ను తాలిబాన్‌లు ఆక్రమించుకున్న తర్వాత.. లక్షలాది మంది అఫ్గాన్లు పొట్ట చేత పట్టుకొని పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చారు. బెలూచిస్థాన్‌ ప్రావిన్సులో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 24 ఆత్మాహుతి దాడులు జరిగాయి. వీటిలో 14 దాడుల వెనుక అఫ్గాన్‌ పౌరులే ఉన్నట్లు తేలింది. దీంతో వారందరినీ దేశం నుంచి సాగనంపేందుకు పాక్ సన్నాహాలు చేస్తోంది.

Advertisement

Next Story