ఎలక్షన్ రిజల్ట్ రిలీజ్.. నవాజ్, భుట్టో సంకీర్ణానికి లైన్ క్లియర్ !

by Hajipasha |
ఎలక్షన్ రిజల్ట్ రిలీజ్.. నవాజ్, భుట్టో సంకీర్ణానికి లైన్ క్లియర్ !
X

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. దేశంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ హోరాహోరీగా తలపడుతున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీకి గత గురువారం పోలింగ్ జరగగా.. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. నాటి నుంచి జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎట్టకేలకు ఆదివారం ఉదయం ముగిసిందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపులో ఎన్నికల సంఘం జాప్యం చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇమ్రాన్ ఖాన్ అనుచరులు దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. తాము గెలుస్తున్నామనే అక్కసుతో.. పాక్ సైన్యం, పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ కలిసి లోలోపల ఏదో చేస్తున్నారని ఇమ్రాన్ అనుచరులు ఆరోపించారు. దీంతో ఆదివారం ఉదయం పాక్ ఎన్నికల సంఘం మొత్తం ఫలితాల వివరాలను వెల్లడించింది.

ఇమ్రాన్ అనుచరుల హవా..

ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగి 101 స్థానాల్లో గెలుపొందారు. మరో 32 సీట్లను సాధిస్తే .. పాకిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ వారికి దక్కి ఉండేది. ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ)ను ఎన్నికల సంఘం బ్యాన్ చేసింది. ఈనేపథ్యంలో ఎంక్యూఎం అనే మరో పార్టీలో చేరి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇమ్రాన్ అనుచరులు అడుగులు వేస్తారనే ప్రచారం పాక్ మీడియాలో జరుగుతోంది. ఎంక్యూఎం పార్టీకి ఎన్నికల్లో 17 సీట్లు వచ్చాయి. మిగతా స్వతంత్ర అభ్యర్థులను కూడగట్టి వారు సర్కారు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

నవాజ్‌కే ఛాన్స్ ఎక్కువ

అయితే సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసే అవకాశాలు నవాజ్ షరీఫ్‌కే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. నవాజ్‌కే పాక్ ఆర్మీ మద్దతు ప్రకటించింది. నవాజ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్)కు 73 సీట్లు, బిలావల్ భుట్టోకు చెందిన రాజకీయ పార్టీకి 54 సీట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు చేతులు కలిపేందుకు ఇప్పటికే రెడీ అయ్యాయి. ఈ రెండు పార్టీలకు కలిపి మొత్తం 127 సీట్లు వచ్చాయి.మరో ఆరుగురు స్వతంత్రులను తమ వైపు తిప్పుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నవాజ్ అండ్ భుట్టో టీమ్ నిర్ణయించుకుంది. ఇంకొన్ని గంటల్లోనే దీనిపై సస్పెన్స్ వీడుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story