అక్రమ వివాహ కేసులో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌‌ దంపతులకు ఊరట

by Harish |
అక్రమ వివాహ కేసులో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌‌ దంపతులకు ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: అక్రమ వివాహ కేసులో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దంపతులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇస్లామాబాద్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. 2018లో ఇమ్రాన్‌ఖాన్‌‌-బుష్రా బీబీ ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించి వివాహం చేసుకున్నారని ఆమె మాజీ భర్త ఖవార్ ఫరీద్ మనేకా పిటిషన్ దాఖలు చేశారు. బుష్రా బీబీ 2017 నవంబరులో తన నుంచి విడాకులు తీసుకున్న వెంటనే విరామం తీసుకోకుండా వీరిద్దరూ వివాహం చేసుకున్నారని మాజీ భర్త ఖవార్ ఆరోపించారు. ఇస్లాంలో, ఒక స్త్రీ విడాకులు తీసుకున్న లేదా తన భర్త మరణించిన తర్వాత నాలుగు నెలలు పూర్తి కాకముందే మళ్లీ పెళ్లి చేసుకోకూడదు. కానీ ఇమ్రాన్‌ఖాన్‌‌-బుష్రా బీబీ ఈ నిబంధనలను అతిక్రమించారని పేర్కొంటూ, ఇస్లామాబాద్ కోర్టు ఈ దంపతులను దోషులుగా నిర్ధారించి ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

దీంతో వారిద్దరూ, జిల్లా, సెషన్ కోర్టులో సవాల్ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి (ADSJ) అఫ్జల్ మజోకా కేసును విచారించి, శనివారం వారిని నిర్దోషులుగా ప్రకటించారు. మరే ఇతర కేసులో వారు దోషులుగా లేకపోతే ఇమ్రాన్ ఖాన్-బుష్రా బీబీలను వెంటనే జైలు నుండి విడుదల చేయాలని న్యాయమూర్తి అన్నారు. అయితే ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించినప్పటికీ మే 2023లో తన మద్దతుదారులచే అల్లర్లను ప్రేరేపించిన ఆరోపణలపై ఇమ్రాన్‌ఖాన్‌‌ ఇంకా జైలులోనే ఉన్నారు.



Next Story