‘ఆస్కార్’ విజేతల పూర్తిజాబితా.. మరోసారి మెరిసిన ‘ఆర్ఆర్ఆర్’

by Swamyn |
‘ఆస్కార్’ విజేతల పూర్తిజాబితా.. మరోసారి మెరిసిన ‘ఆర్ఆర్ఆర్’
X

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భత విజయాన్నందుకున్న ‘ఓపెన్‌హైమర్’ మూవీ ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ అవార్డుల్లోనూ సత్తాచాటింది. ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఇందులో ఓపెన్‌హైమర్ మూవీ ఏడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబును సృష్టించిన రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ ఓపె‌న్‌హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరక్కించిన ఈ బయోగ్రాఫికల్ వార్ థ్రిల్లర్ మూవీ.. ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ మొత్తం 13 కేటగిరీల్లో పోటీ పడగా, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా ఏడు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఓపెన్‌హైమర్‌తోపాటు ‘పూర్ థింగ్స్’, ‘బార్బీ’, ‘అనాటమీ ఆఫ్ ఏ ఫాల్’, ‘ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్’ వంటి మూవీస్ సైతం సత్తాచాటాయి. కాగా, గతేడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’(నాటు నాటు పాటకు), బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ ఆస్కార్ అవార్డులు అందుకోగా ఈసారి భారతీయ చిత్రాలేవీ ‘ఆస్కార్’ గెలుచుకోలేదు. అయితే, గ‌తేడాదిలో చ‌నిపోయిన సినిమా లెజెండ్ల‌ను స్మ‌రించుకున్న సంద‌ర్భంలో భారతీయ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్‌కి కూడా ఆస్కార్ వేదిక‌గా గౌర‌వం ద‌క్కింది. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు నితిన్ అందించిన సేవ‌ల‌ను ఆస్కార్ వేదిక గుర్తుచేసుకుంది. ల‌గాన్‌, జోధా అక్బ‌ర్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి సూపర్ హిట్ బాలివుడ్ సినిమాలకు నితిన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. మరోవైపు, ఇప్పటివరకు వచ్చిన బెస్ట్‌ స్టంట్స్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను వేదికపై చూపించగా, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని రెండు యాక్షన్‌ షాట్స్‌ను అందులో చూపడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తన అధికారిక ట్విట్టర్(ఎక్స్‌) ఖాతాలో పంచుకుంది.

ప్రధాన కేటగిరీల్లో ఆస్కార్ విజేతల జాబితా

* ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)

* ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)

* ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)

* ఉత్తమ సహాయ నటి: డావిన్ జాయ్ రండాల్ఫ్ (ది హోల్డోవర్స్)

* ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)

* ఉత్తమ చిత్రం: ఓపెన్‌హైమర్

* బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: వార్ ఈజ్ ఓవర్

* బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: ది బాడీ ఆండ్ హెరాన్

* బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: అనాటమీ ఆఫ్ ఏ ఫాల్

* బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్: పూర్ థింగ్స్

* బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: పూర్ థింగ్స్

* బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: పూర్ థింగ్స్

* బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్

* బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్‌హైమర్

* బెస్ట్ డాక్యుమెంటరీ: ది లాస్ట్ రిపేర్ షాప్

* బెస్ట్ సినిమాటోగ్రఫీ: ఓపెన్‌హైమర్

* బెస్ట్ సౌండ్: ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్

* బెస్ట్ స్కోర్: ఓపెన్‌హైమర్

* బెస్ట్ సాంగ్: ‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్’ (బార్బీ)


Advertisement

Next Story